ఆకర్షణీయ గ్రామంగా మోరి : చంద్రబాబు

SMTV Desk 2017-05-31 19:29:33  east godavari, smat village ,Chandrababu,America,barkiliuniversity,

తూర్పు గోదావరి, మే 31 : రాష్ట్రంలో వేలాది పల్లెలకు దిశానిర్దేశం చేసే విధంగా తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ వర్శిటీగా తీర్చిదిద్దాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ గ్రామాన్ని భవిష్యత్తులో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నమూనాగా తీర్చిదిద్దాలన్నారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం మోరీ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. మోరి స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టు-2ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా బర్కిలీ వర్సిటీ పరిశోధకుడు ప్రొఫెసర్ సాల్మన్ డార్విన్ బృందంతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. స్మార్ట్ గ్రామం అంటే కేవలం అత్యున్నత సదుపాయాలతో విలసిల్లేదే కాదని, అది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేదిగా ఉండాలన్నారు. గతంలో గ్రామాల్లో లభ్యమయ్యే వివిధ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రాచుర్యం కల్పించేందుకు 45 బహుళజాతి సంస్థలు, 25 అంకుర సంస్థలు ఆసక్తి కనబరిచాయన్నారు. ఈ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించి ముందుగా ఎంపిక చేసిన 465 గ్రామాల్లో స్థానిక ఉత్పత్తులను సేకరించి, విక్రయించే ప్రాజెక్టును తయారుచేయాలని కోరారు. ఇందుకు చొరవ తీసుకుంటే ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తాయన్నారు. వచ్చే ఏడాదిలోగా దశలవారీగా ఎంపిక చేసిన గ్రామాల్లో అమలు చేయాలన్నారు. గ్రామాల్లోని ప్రజలను వ్యాపార, పారిశ్రామికవేత్తల్లుగా తీర్చిదిద్దాలని కోరారు. గ్రామీణ వాణిజ్య, వ్యాపార సంస్థలకు విజ్ఞానం, పరిశోధన, మేలిమి అనుసరణీయ పద్ధతులతో ఈ ప్రాజెక్టు సాధికారత కల్పిస్తుందన్నారు. మోడల్ వర్సిటీకి పాఠ్యాంశాలు, బోధన, శిక్షణ కార్యక్రమాలను బర్కిలీ వర్సిటీ రూపొందిస్తుందన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన యువ ప్రతినిధులు స్మార్ట్ గ్రామ బృందంలో సభ్యులుగా ఉంటారన్నారు.