పంచాయితీ ఎన్నికలకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్

SMTV Desk 2019-01-03 16:10:08  Telangana panchayati elections, High court, BC Reservations

హైదరాబాద్, జనవరి 3: తెలంగాణ పంచాయితీ ఎన్నికల్లో రిజర్వేషన్ల తగ్గింపు పై ప్రతిపక్ష పార్టీలు హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ను కూడా విడుదల చేసిన సమయంలో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై అటు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉత్కంఠతో ఎదురుచూశారు. అయితే అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ హైకోర్టు పంచాయితీ ఎన్నికలకు గ్రీస్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయితీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ ను 34 శాతం 22 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం విడుదలచేసిన ఆర్డినెన్స్ రద్దు చేసి... ఎన్నికల నోటిఫికేషన్ ను నిలిపివేయాలంటూ బీసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్యతో పాటు జాజుల శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్... ఇప్పటికే పంచాయితీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు జరిగి నోటిఫికేషన్ కూడా వెలువడింది కాబట్టి ఈ ప్రక్రియను ఆపలేమని స్పష్టం చేశారు.

పిటిషనర్లు తమ పిటిషన్ లో పేర్కొన్నట్లు బిసి రిజర్వేషన్లు తగ్గించడం రాజ్యాంగ విరుద్దమేమీ కాదన్నారు. బిసిలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యంగంలో ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని హైకోర్టు కూడా తేల్చిచెప్పింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వ ఆర్డినెన్స్ ను రద్దు చేయడం కానీ ఎన్నికలపై స్టే విధించడం కానీ జరగదని రాధాకృష్ణన్ వెల్లడించారు.
ఈ కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసిన కోర్టు...అప్పటివరకు రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలతె ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.