106 ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభించిన ప్రధాని

SMTV Desk 2019-01-03 15:13:46  Indian Science Congress, students, Nobel laureates, Jalandhar

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో వరల్డ్ లో అతిపెద్దదైన సైన్స్‌ పండగ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ (ఐఎస్‌సీ) పంజాబ్‌లోని జలంధర్‌లో ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం అయింది. ‘ఫ్యూచర్‌ ఇండియా: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇతివృత్తంగా ఐదు రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాలకు లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ వేదిక కానుంది. దేశ విదేశాలకు చెందిన దాదాపు 30 వేల మంది ఐఎస్‌సీలో పాల్గొంటారని, ఇందులో పలుదేశాల నోబెల్‌ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా కేంద్ర శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన, భూవిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్, టెక్స్‌టైల్‌ శాఖ మంత్రి స్మృతి ఇరానీలతోపాటు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొంటారని చెప్పారు.


ప్రతి సంవత్సరం జనవరి 3వ తేదీన ప్రారంభమయ్యే ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు వినూత్నమైన చరిత్ర ఉంది. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల ముఖ్య ఉద్దేశం దేశ ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడమే. గత ఏడాది ఐఎస్‌సీ వేడుకలు హైదరాబాద్‌లో జరగాల్సి ఉండగా చివరి నిముషంలో రద్దయింది. దీంతో రెండు నెలల తరువాత మణిపూర్‌లో నిర్వహించారు. ఈ ఏడాది జలంధర్‌లో జరగనున్న 106వ సైన్స్‌ కాంగ్రెస్‌లో పలు వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారని సదస్సు జనరల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మనోజ్‌ కుమార్‌ తెలిపారు. లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ విద్యార్థులు సిద్ధం చేసిన సౌరశక్తి బస్సులో ప్రధాని మోదీ సమావేశ కేంద్రానికి విచ్చేస్తారని ఎల్‌పీయూ ఉపకులపతి అశోక్‌ మిట్టల్‌ తెలిపారు. ఐఎస్‌సీలో ఏర్పాటు చేసిన ఆరు ప్రత్యేక ప్రదర్శనశాలల్లో సీఎస్‌ఐఆర్, డీఆర్‌డీవో, డీఏఈ, ఐసీఎంఆర్‌ వంటి ప్రభుత్వ సంస్థల ప్రదర్శన ఉంటుందని, ఇందులో ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా అన్నది దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసేదని ఆయన వివరించారు.

ఐఎస్‌సీ – 2019 రెండోరోజున జరిగే చిల్డ్రన్స్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ యువ ప్రతిభకు వేదికగా నిలవనుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎంపిక చేసిన దాదాపు 150 సైన్స్‌ ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. అదేరోజున విమెన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రారంభం కానుంది. ఐఎస్‌సీ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ నోబెల్‌ గ్రహీతలైన ముగ్గురు శాస్త్రవేత్తలతో ఛాయ్‌ పే చర్చా కార్యక్రమంలో మాట్లాడనున్నారు. ప్రొఫెసర్‌ థామస్‌ సి.సుడాఫ్‌ (2013 వైద్య శాస్త్ర నోబెల్‌ గ్రహీత), ప్రొఫెసర్‌ అవ్‌రామ్‌ హెర్ష్‌కో (2004 కెమిస్ట్రీ నోబెల్‌ గ్రహీత), ప్రొఫెసర్‌ ఎఫ్‌.డంకన్‌ ఎం.హల్డానే (2016 ఫిజిక్స్‌ నోబెల్‌ గ్రహీత) ఈ చర్చలో పాల్గొంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్‌ ముందడుగు వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి ప్రధాని సలహాలు, సూచనలు తీసుకుంటారని సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.