సెంచరీతో రాణించిన పుజారా

SMTV Desk 2019-01-03 12:49:35  Cheteshwar Pujara, india vs australia, test series, sydney test

సిడ్నీ,జనవరి 3: ఇండియా, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో టీమిండియా ఆటగాడు చతేశ్వర్‌ పుజారా శతకాలపై శతకాలతో విజృంభిస్తున్నాడు. ఆసీస్‌తో చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పుజారా సెంచరీ సాధించాడు. పుజారా టెస్టు కెరీర్‌లో ఇది 18 వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో మూడో శతకం సాధించాడు. తొలి టెస్టులో శతకం సాధించిన పుజారా.. మూడో టెస్టులో సెంచరీ నమోదు చేశాడు. ఈ రెండు టెస్టుల్లో తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీలు సాధించిన పుజారా.. నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. 199 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ సాధించాడు. 134 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన పుజారా.. మరో 65 బంతుల్లో్ వంద పరుగుల మార్కును చేరాడు. పుజారా ఫోర్‌తోనే హాఫ్‌ సెంచరీ, సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. ఇదిలా ఉంచితే, ఆస్ట్రేలియాలో వొక టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా.. సునీల్‌ గావస్కర్‌ సరసన నిలిచాడు.

ఆస్ట్రేలియాలో వొక సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో కోహ్లి(4) తొలి స్థానంలో ఉన్నాడు. ఈ టెస్ట్ లో పుజారా సెంచరీ సాధించడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో్ 78 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ 262 పరుగులు చేసింది. అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(77) రాణించిన సంగతి తెలిసిందే. రాహుల్‌(9) తొలి వికెట్‌గా ఔట్‌ కాగా, మయాంక్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మూడో వికెట్‌గా కోహ్లి(28), నాల్గో వికెట్‌గా రహానే(18) ఔటయ్యారు.