చంద్రబాబు ప్రభుత్వం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శివాజీ ...

SMTV Desk 2019-01-02 17:59:26  AP, TDP, Chandrababu, Shivaji, YSRCP, YS Jagan mohan reddy

అమరావతి, జనవరి 2: చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేందుకు అనేక కుట్రలు జరుగుతున్నాయని మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు శివాజీ. కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అధికారులే టార్గెట్ గా రెచ్చిపోయారు శివాజీ. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు మంత్రుల సిఫారసులను కూడా పరిగణించడం లేదన్నారు. చుక్కల భూములపై అధికారులు మంత్రులను లెక్కచెయ్యడం లేదన్నారు. చుక్కల భూములకు సంబంధించి ఫైల్ ను కొంతమంది అధికారులు తొక్కిపెడుతున్నారని స్పష్టం చేశారు. చుక్కల భూములపై రైతులను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.చుక్కల భూములను ఈస్ట్ టిండియా కంపెనీ రెగ్యులరైజ్ చేసిందని గుర్తు చేశారు.

తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని వాటిని చంద్రబాబుకు అందజేస్తానని తెలిపారు. చుక్కల భూముల వ్యవహారంపై చంద్రబాబు చెప్పినా కొందరు కలెక్టర్లు మాట లెక్కచెయ్యడం లేదన్నారు. ఆ భూములు వాళ్ల అబ్బ సొత్తా అంటూ విరుచుకుపడ్డారు శివాజీ. వాళ్లకి రాజకీయ పార్టీలంటే మక్కువ ఏర్పడిందని అటువంటి వారు రాజీనామా చేసి వెళ్లిపోవాలని హితవు పలికారు. చుక్కల భూముల సమస్యను సంక్రాంతిలోగా పరిష్కరించకుంటే నిరాహార దీక్ష చేస్తానని శివాజీ హెచ్చరించారు. మరోవైపు ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శల దాడి చేశారు. ఎంతసేపు జగన్ ధ్యాస అంతా సీఎం కుర్చీపైనేనని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు జగన్ కు పట్టడం లేదని ఘాటుగా విమర్శించారు.