కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ బహుమతులు

SMTV Desk 2019-01-02 15:45:29  Central government, Employees, New year gift, Extension service period

న్యూ ఢిల్లీ, జనవరి 2: మోడీ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వం దాదాపు 4 వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి కల్పించింది. ఇందులో 1,756 మంది సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసు వాళ్లు కాగా 2,235 మంది సెంట్రల్ సెక్రటేరియట్ స్టెనోగ్రాపర్ సర్వీసు వాళ్లు. పదోన్నతి కోసం వీరంతా దాదాపు 10 నుంచి 15 ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. శాఖాపరమైన సమస్యలు, పదోన్నతుల్లో ఇబ్బందులు తదితర కారణాలతో ప్రమోషన్లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో వీరికి కొత్త ఏడాది కానుకగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించిన కేంద్రం ఆ మేరకు చర్యలు తీసుకుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ పదోన్నతి పొందకుండానే చాలా మంది రిటైర్ అవుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉండేది. ప్రస్తుతం దాదాపు 4వేల మందికి పదోన్నతి లభించినందుకు ఆత్మ సంతృప్తి కలుగుతున్నది అని చెప్పారు. డిసెంబర్ 31లోగా వీరికి ప్రమోషన్లు కల్పించడానికి తన శాఖ అధికారులు చాలా కష్టపడ్డారని, వారందరినీ అభినందిస్తున్నానని తెలిపారు.