ఓటమిపై వివరణ ఇచ్చిన కోదండరాం

SMTV Desk 2019-01-02 14:12:45  Telangana assembly elections, Congress party, Mahakutami, Prof. Kodandaram

హైదరాబాద్, జనవరి 2: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో పరాజయ పాలైన టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రో. కోదండరాం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ప్రజా కూటమిలోని కొందరు నేతల అతి విశ్వాసం కారణంగానే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని ఓటమికి ఈవీఎంలను బూచిగా చూపడం బాధ్యతారాహిత్యమనీ, ఫలితాలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ ఈవీఎంలపై తప్పు నెట్టడం సరికాదన్నారు. ఓటమికి గల ఆసలు కారణాలను సమీక్షించకుండా లాభం లేదని అభిప్రాయపడ్డారు. అంతేకాక ఓటమికి గల కారణాలపై కాంగ్రెస్‌ పార్టీ అసలు అంశాలను కాకుండా ఇతర అంశాలపై చర్చలు చేస్తున్నదని పేర్కొన్నారు.

కూటమి భాగస్వామ్య పక్షాల ఓటమికి ఓటమికి గల కారణాలను జన సమితి విశ్లేషణ చేస్తుందన్నారు. సీట్ల సర్దుబాటు త్వరగా తేల్చండి అని తాను ఎంతగా చెప్పినా వినలేదన్నారు. నెలకు పైగా సమయం ఉంటే తప్ప కేసీఆర్‌ను ఎదుర్కోలేమని కూటమి నేతలకు స్పష్టంగా చెప్పాననీ, అయినప్పటికీ ఆలస్యం చేశారని విమర్శించారు. పైగా, ప్రచారానికి మూడు వారాల సమయం చాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారనీ, అంతెందుకు కేవలం రెండు వారాలు మాత్రమే చాలని టీడీపీ నేతలు అన్నారని వివరించారు. కేవలం సభలు, సమావేశాలతోనే ప్రచారం ముగించడంతో పూర్తి స్థాయిలో జనాల్లోకి వెళ్లలేకపోయామని పేర్కొన్నారు.

కూటమి ఎజెండా, మేనిఫెస్టో బాగానే ఉన్నప్పటికీ వాటిని జనాల్లోకి కింది స్థాయిలో తీసుకుని వెళ్లడంలో ఘోరంగా విఫలమయ్యారని అంగీకరించారు. ప్రచారంలో ఎవరు ఎక్కడ పాల్గొనాలి అనే దానిని అంచనా వేయలేకపోయామని చెప్పారు. ముఖ్యమైన నేతలను కూడా రాహుల్‌ సభల్లో ప్రసంగాలు చేయించడం వరకే పరిమితం చేశారని విమర్శించారు. అలా కాకుండా ఇతర ప్రదేశాల్లో కూడా ప్రచారం చేయించాల్సి ఉంటే ఫలితాలు కొంత మెరుగ్గా ఉండేవని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ తెర మీదికి తెచ్చి హడావుడి చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ అనేది సాధ్యం అయ్యే ప్రసక్తే లేదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ చేస్తున్న రాజకీయం వెనక ఎవరున్నారో ఇంకా తమకు తెలియలేదన్నారు.

సీట్ల సర్దుబాటులో జరిగిన విపరీతమైన జాప్యంతో తీవ్ర నష్టం జరిగిందనీ, టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనను, కేసీఆర్‌ వైఫల్యాలను ప్రజలలో ఫోకస్‌ చేయలేకపోయామన్నారు. దీనికి తోడు కేసీఆర్‌ రాజకీయ చతురతను అంచనా వేసి ఎదుర్కోవడంలో విఫలమయ్యామని విశ్లేషించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తనకు రాజ్యసభ సీటు ఆఫర్‌ చేసినట్లు వచ్చిన వార్తలలో ఏమాత్రం నిజం లేదనీ, ఆ దిశగా తమ మధ్య చర్చలు కూడా జరగలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజా కూటమి కొనసాగుతుందనీ, రానున్న పార్లమెంటు ఎన్నికలపై త్వరలోనే సమావేశమై చర్చిస్తామని వివరించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కూటమి దిశగా సాగుతున్నందున ఇక్కడ కూడా కూటమి ఉండే అవకాశమే లేదని కోదండరాం పేర్కొన్నారు.