రాష్ట్రంలో కులాంతర వివాహాలకు కొత్త నియమాలు

SMTV Desk 2019-01-02 13:46:13  Telangana state, Inter caste marriage, Central government

హైదరాబాద్, జనవరి 2: రాష్ట్రంలో కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తుంది. కులాంతర వివాహాలు చేసుకునే షెడ్యూల్డు కులాలకు చెందిన వారిని ఆర్థికంగా ఆదుకోవడం ప్రధాన లక్ష్యంగా పెంచే ఆలోచన చేస్తున్నట్లు అధికారవర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ నేపధ్యంలో కేంద్రం ఇస్తున్న 2.50 లక్షల రూపాయలతోపాటు, ప్రస్తుతం రాష్ట్రం ఇస్తున్న 50 వేల రూపాయల ప్రోత్సాహకాన్ని 2.50 లక్షల రూపాయలకు పెంచనున్నట్లు సమాచారం. సాంఘిక సంక్షేమ శాఖ డైరక్టర్‌ కరుణాకర్‌ ఇటీవల వీటికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. కాగా రాష్ట్రంలో ఎస్సీ కులంతర వివాహాలు గణనీయంగా తగ్గాయి.

అధికారిక లెక్కల ప్రకారం గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కులాంతర వివాహాల సంఖ్య తగ్గుతూ రావడంతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. కులాంతర ప్రోత్సాహకాల విషయంలో దరఖాస్తులను పరిశీలిస్తే క్రమేపీ తగ్గుతున్నట్లు తెలుస్తుంది. 2015-16 సంవత్సరంలో రాష్ట్రంలో 1,959 మంది ఎస్సీకి చెందిన వారు కులాంతర వివాహాలు చేసుకోగా, 2017-18 సంవత్సరం నాటికి ఈ సంఖ్య 1,090కి పడిపోయినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. కులాంతర వివాహాల సంఖ్య తగ్గడంతోపాటు ప్రోత్సాహకానికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. ఇచ్చే ప్రోత్సాహం 50 వేల రూపాయలు కావడంతోపాటు, కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగలేక పలువురు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.

నాలుగేళ్లలో వరంగల్‌ జిల్లాలో 710 మంది, నల్లగొండ జిల్లాలో 594 మంది, హైదరాబాద్‌లో 551 మంది, రంగారెడ్డి జిల్లాలో 359 మంది, నిజామాబాద్‌ జిల్లాలో 387 మంది, ఖమ్మంలో 378 మంది, కరీంనగర్‌ జిల్లాలో 405 మంది కులాంతర వివాహం చేసుకున్న వారి దరఖాస్తులు వచ్చాయి. కులాంతర వివాహం నిమిత్తం ప్రోత్సాహకంగా కేంద్రం నుండి 2.50 లక్షల రూపాయలు మంజూరవుతుండగా, రాష్ట్రం 50 వేల రూపాయలను ఇస్తోంది. దీంతో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి 2.50 లక్షల రూపాయలు ఇస్తే మొత్తం 5 లక్షల రూపాయలకు చేరుకుంటుందని, ఇందువల్ల కులాంతర వివాహాలు చేసుకునే వారి సంఖ్య పెరగడంతోపాటు, దరఖాస్తు చేసుకునేవారు ఆసక్తి చూపుతారని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు భావిస్తున్నారు.