ఉమ్మడి హైకోర్టుకి నేడే ఆఖరి రోజు.. కంట తడి పెట్టుకున్న న్యాయవాదులు

SMTV Desk 2018-12-31 12:42:39  Highcourt,Telangana,andhrapradesh,lawyers,justice,

హైదరాబాద్, డిసెంబర్ 31: ఉమ్మడి హైకోర్టు విభజన రేపటి నుండి ప్రారంభం కానున్న సందర్భంగా హైకోర్టు లోని న్యాయవాదులు భావోద్వేగానికి లోనయ్యారు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం రేపటి నుంచి ఏపీ రాజధాని అమరావతిలో హైకోర్టు సేవలు అందించాల్సి ఉండటంతో తరలింపు ప్రక్రియ వేగవంతమైంది.న్యాయవాదులు, సిబ్బంది, టన్నుల కొద్దీ ఫైళ్లను అమరావతికి తరలించేందుకు ఈ ఉదయం అఫ్జల్‌గంజ్ సమీపంలోని ఉమ్మడి హైకోర్టు కు పెద్ద సంఖ్యలో బస్సులు, లారీలు చేరుకున్నాయి.
రాజకీయపరమైన కారణాలు, ఉద్యమం, సెంటిమెంట్, ప్రత్యేక కోర్టులు ఇటువంటి వాటిని పక్కనబెట్టి నిన్నటి వరకు కలిసిమెలిసి ఉన్న తెలంగాణ, ఆంధ్రా లాయర్లు, సిబ్బంది నేడు వొకరిని విడిచి మరోకరు వెళ్లిపోతుండటంతో భావోద్వేగానికి గురయ్యారు.
తమ మిత్రులకు శుభాకాంక్షలు చెబుతూనే, ఇరు వర్గాలు కన్నీరు పెట్టుకున్నాయి. ఇలా విడిపోవడం తమకెంతో బాధను కలిగిస్తోందని అన్నారు. మరోవైపు హైదరాబాద్ నుంచి ఫైళ్లు, సిబ్బందితో ఈ రోజు రాత్రి బస్సులు, లారీలు విజయవాడ చేరుకుంటాయి.
రేపటి నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ సహా, పలు భవనాలను తాత్కాలిక హైకోర్టు భవనాలుగా ఏపీ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తుల చేత గవర్నర్ నరసింహాన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.