ఎనిమిదో శ్వేతపత్రం విడుదల...

SMTV Desk 2018-12-30 15:10:23  Chandrababu, KCR, 8th white paper

అమరావతి, డిసెంబర్ 30: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ‘గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతలు కల్పనపై ఎనిమిదో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో పంచాయితీ, అంగన్ వాడీ, పాఠశాలల్లో 100 శాతం పక్కా భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మరో రెండేళ్లలో ఈ లక్ష్యాన్ని అందుకుంటామని పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో స్మశానాలు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ప్రతీ కుటుంబానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద రోజుకు 70 లీటర్ల మేర నీటిని అందిస్తామని సీఎం చెప్పారు. ఈ పధకానికి రూ.15,874 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అయితే తెలంగాణలో కేవలం 46 శాతం మంది ప్రజలకు మంచినీటిని అందించేందుకు ఏకంగా రూ.56,000 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. అయినా నీళ్లు ఎక్కడ వస్తాయో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి వారు పాలన ఎలా చేయాలో తనకు చెబుతున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరోక్షంగా విమర్శించారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.