భారత్ విజయం : రేపటికి వాయిదా

SMTV Desk 2018-12-29 15:22:41  Team india, Australia, Test match, Melbourne Cricket Ground (MCG), Melbourne, Kohli

మెల్‌బోర్న్‌, డిసెంబర్ 29: ఆసిస్ తో నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా మెల్‌బోర్న్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ విజయం ముంగిట నిలిచింది. టీమిండియా బౌలర్లు దూకుడుకు ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. కోహ్లీసేన విజయం దాదాపు ఖాయమైనట్లే. కాని నాలుగో రోజు ఆట భారత్‌ విజయాన్ని రేపటికి వాయిదా పడి టీమిండియాకు నిరాశను మిగిల్చింది. ఈ విజయాన్ని ఆసీస్‌ టెయిలెండర్స్‌ ప్యాట్‌ కమిన్స్‌ (61), నాథన్‌ లయన్‌(6)లు అడ్డుకున్నారు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా టీమిండియా 54/5 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆటను కొనసాగించింది. మరో 52 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (42), రిషభ్‌ పంత్‌(33)లు ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. దీంతో కోహ్లీసేన ఎనిమిది వికెట్ల నష్టానికి 106పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

399 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసిస్ వొక దశలో 176 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. తర్వాత కమ్మిన్స్ చెలరేగిపోవడంతో 258/8 స్కోర్‌తో నాలుగోరోజు ఆట ముగిసింది. ముఖ్యంగా భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ కమ్మిన్స్ 103 బంతులకు 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 61 పరుగులు చేశాడు. లయన్‌, కమిన్స్ జోడీనీ విడదీసెందుకు కెప్టెన్ విరాట్ ఎన్ని వ్యూహాలు, బౌలర్లను మార్చినా అవకాశం ఇవ్వలేదు. అప్పటికే 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయగా. బుమ్రా రెండు, ఇషాంత్ శర్మ, షమీ చెరో వికెట్ తీశాయి.

అంతకు ముందు ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌ (3), మార్కస్‌ హర్రీస్‌ (13)ల వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్‌ ఖాజా (33), షాన్‌ మార్ష్‌(44)లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్‌ (34), మిచెల్‌ మార్ష్ (10), టిమ్‌పైన్‌ (26)లు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేసినప్పటికి భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు.
మ్యాచ్‌లో ఫలితం తేలేందుకు ఆటను అంఫైర్లు సమయాన్ని ఆరగంట పొడిగించినా లయన్‌, కమిన్స్ జోడీనీ విడగొట్టలేక పోవడంతో 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో విజయం కోసం భారత్ రేపటి వరకు ఆగాల్సిందే.