నంద్యాల ఉపఎన్నికకు అధికారిక ప్రకటన

SMTV Desk 2017-07-27 16:03:20  Namdyala By poll, By elections namdyala, Namdyala By election 2017,

నంద్యాల, జూలై 27: కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 5 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఇచ్చారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆగష్టు 9 వ తేదీగా ఖరారు చేశారు. ఆగస్టు 23 న పోలింగ్‌, 28 న ఫలితాల లెక్కింపు జరపాలని ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించడంతో నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఏకగ్రీవంగా అభ్యర్థిని ఎన్నుకునే సాంప్రదాయానికి వైసీపీ తీసుకున్న నిర్ణయంతో అడ్డుకట్ట పడింది. వైసీపీ పార్టీ అభ్యర్థిగా శిల్పా మోహన్‌రెడ్డిని బరిలోకి దింపింది. తెలుగుదేశం పార్టీ భూమా కుటుంబానికి చెందిన బ్రహ్మానందరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. రెండు పార్టీలు ప్రచారాలు ముమ్మరంగా చేస్తున్నాయి. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్‍ఆర్సీ అధినేత ఈ నెలాఖరున జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలిసింది.