మూడో రోజు ఆట ముగిసే సమయానికి 346 పరుగుల ఆధిక్యంలో భారత్..

SMTV Desk 2018-12-28 14:09:26  Team India, Australia, Test match, Perth

మెల్‌బోర్న్, డిసెంబర్ 28: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్ - ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా శుక్రవారం ఉదయం మూడో టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఐదు వికెట్లను కోల్పోయి కుప్పకూలినా భారీ ఆధిక్యంలోనే ఉంది. దీంతో ఆస్ట్రేలియా గడ్డపై మరో విజయానికి టీమిండియా చేరువలో ఉంది. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తుండటంతో టీమిండియాను విజయం వరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 27 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ప్రస్తుతం ఓవరాల్‌గా 346 పరుగుల ఆధిక్యంలో ఉంది.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభయించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ హనుమ విహారి (13)ని కమ్మిన్స్ అవుట్ చేసాడు. ఆ తర్వాత పుజారా (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (0)లను కూడా కమ్మిన్స్ క్యాచ్ అవుట్ చేయడం ద్వారా పెవిలియన్ కు చేర్చాడు. అనంతరం రహానే (1)ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో టీమిండియా 32 పరుగులకే 4 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బౌలింగ్ కు వచ్చిన హేజిల్‌ వుడ్‌, రోహిత్‌ (5)ను అవుట్ చేసాడు. దీంతో భారత్ ఇదో వికెట్ ను కోల్పోయింది. అయితే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. ప్రస్తుతం క్రీజులో రిషబ్‌ పంత్‌(6), మయాంక్‌ (25)లు ఉన్నారు.

అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 151 పరుగులకే కుప్పకూలింది. 8/0 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్ ను భారత పేసర్ బుమ్రా వణికించాడు. బుమ్రా దాటికి ఏ దశలో కోలుకొని ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయి తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది.