మాణిక్యాలరావు రాజీనామ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేసిన టీడీపి నేత

SMTV Desk 2018-12-27 20:40:47  Tadepally gudem constituency, BJP MLA, Manikyalarao, Resigning, TDP, Leaders, Eeli nani

తాడేపల్లి గూడెం, డిసెంబర్ 27: ఈ మధ్య తన పదవికి రాజీనామ చేస్తాను అని వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావుపై స్పందిచిన తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్ ఈలి నాని ఘాటు విమర్శలు చేశారు. మాణిక్యాలరావువి దిగజారుడు రాజకీయాలు అంటూ తిట్టిపోశారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాను స్పీకర్‌ ఫార్మేట్‌లో ఇవ్వాలి, కానీ ముఖ్యమంత్రికి ఇవ్వడం ఏమిటి? అని ప్రశ్నించారు. స్పీకర్‌ ఫార్మేట్‌లో ఇస్తే ఇచ్చిన రోజులోనే ఆమోదింపబడుతుందని భయమా అంటూ విమర్శించారు. వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తిని తీసుకువచ్చి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేను చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఉండటం దౌర్భాగ్యం అని మాణిక్యాల రావు అనడం విడ్డూరంగా ఉందంటూ మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలు ఆయన్ను గెలిపించడమే వొక దౌర్భాగ్యమని కౌంటర్ ఇచ్చారు.

తాను టికెట్‌ త్యాగం చేస్తేనే మాణిక్యాలరావు ఎమ్మెల్యే అయ్యాడని ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారని చెప్పారు. మాణిక్యాలరావు గెలుపుకోసం తాను ఇంటింటికి తిరిగానని గుర్తు చేశారు. మాణిక్యాలరావుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. తాడేపల్లి నియోజకవర్గానికి రూ.2017 కోట్లు నిధులు తీసుకొచ్చానని మాణిక్యాలరావు అసత్యాలు చెప్తున్నారంటూ ఆరోపించారు. ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా నియోజకవర్గానికి రూ.800 కోట్లుకు మించి నిధులు తీసుకొచ్చిన దాఖలాలు లేవన్నారు. రూ. 2017 కోట్లు తీసుకొస్తే నియోజకవర్గం ఇలానా ఉండేది అంటూ ఈలి నాని ఎద్దేవా చేశారు.