ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసిన తెలంగాణ సీఎం

SMTV Desk 2018-12-27 18:22:14  CM,KCR, TRS, Samajwaadi forward black party, Party symbol, Car, Truck, Election commissioner

హైదరాబాద్, డిసెంబర్ 27: తమ పార్టీ గుర్తుని పోలీ మరో పార్టీ గుర్తు వుందని ఎన్నికల కమీషనర్ సునీల్ ఆరోరాకు ఫిర్యాదు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. సమాజ్‌ వాదీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి ట్రక్కు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. అయితే ట్రక్కును కారుగా భావించిన గ్రామీణ ప్రాంత ఓటర్లు ఈ గుర్తుపై ఓట్లు వేశారాని ముఖ్యమంత్రి ఆరోపించారు. దీనివల్ల తాము ఎంతో నష్టపోయామని ఎన్నికల అధికారికి వెల్లడించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తు వేరే పార్టీకి కేటాయించడంపై టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని కేసీఆర్ ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ట్రక్కు గుర్తును తెలంగాణలో కేటాయించకూడదని ఆయన కోరారు. ట్రక్కు గుర్తుతో పాటు ఇస్త్రీ పెట్టె గుర్తును కూడ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికీ కూడ కేటాయించకూడదని కేసీఆర్ కోరారు. మరోవైపు తెలంగాణలో ఓట్ల తొలగింపు వల్ల తాము తీవ్రంగా నష్టపోయినట్టు కూడ కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. లోక్‌సభ ఎన్నికలలోపుగా ఓటర్ల జాబితాను సవరించాలని కేసీఆర్ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కోరారు.