ట్రిపుల్ తలాక్ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలి.!

SMTV Desk 2018-12-27 17:17:35  Triple talaq ,Loksabha, Debate, Congress

న్యూఢిల్లీ, డిసెంబర్ 27 : పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లుపై గందరగోళం నెలకొంది. ట్రిపుల్ తలాక్ బిల్లు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని, ఈ బిల్లు ద్వారా ముస్లిం మహిళలకు రక్షణ కలుగుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మతపరమైన అంశాల్లో జోక్యం తగదని కాంగ్రెస్‌ నేతృత్వంలో తృణమూల్‌, ఎన్సీపీ, ఆప్‌, ఎంఐఎంలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్ సభలో ఈరోజు సుదీర్ఘ చర్చ కొనసాగుతోంది. ఈ బిల్లు పట్ల కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు తలెత్తడంతో బిల్లుపై చర్చకు సహకరించాలని సభ్యులకు మంత్రి రవిశంకర్ ప్రసాద్ విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు.

అనంతరం రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, బిల్లులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలించి సరిచేస్తామన్నారు. ఇప్పటికే పలు దేశాలు ఈ ఆచారాన్ని రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ, ట్రిపుల్ తలాక్ బిల్లుపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉందని, దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని విజ్ఞప్తి చేశారు.