మోడీతో కేసీఆర్ భేటి: కౌంటర్లు వేసిన చంద్రబాబు

SMTV Desk 2018-12-26 16:53:26  Chandrababu naidu, Nrendra nodi, kcr

అమరావతి, డిసెంబర్ 26: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర మఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ మోదీ యాక్షన్, కేసీఆర్ ​రియాక్షన్ లు చూస్తుంటే రెండు వొక్కటేనని అర్థమవుతుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నిన్నటి వరకు రాష్ట్రాలు తిరిగిన కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీని కలవడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. బ్రీఫింగ్ ఇచ్చేందుకు వెళ్లారా, సమస్యలను చెప్పేందుకు వెళ్లారా అంటూ సెటైర్లు వేశారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ తిరుగుతూ వివిధ రాష్ట్రాలు తిరుగుతున్న కేసీఆర్ తాజాగా ప్రధానిని కలవడం వెనుక ఆంతర్యం ఏంటో తెలుస్తుందన్నారు. ప్రధానితో భేటీ దేనికి సంకేతాలు ఇస్తున్నాయంటూ మండిపడ్డారు.

ఇప్పటి వరకు కేసీఆర్ కలిసిన నేతల అభిప్రాయాలను ప్రధాని మోదీకి తెలిపేందుకు వెళ్లారా, లేక రాష్ట్రంలోని నెలకొన్న సమస్యలు గురించి చర్చించనున్నారా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యల వల్లే కేసీఆర్ ను జాతీయ నేతలు నమ్మడం లేదంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.
మరోవైపు కేసిఆర్ చెప్తున్న ఫెడరల్ ఫ్రంట్ తో చేసేది ఏమీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 17 మంది ఎంపీలతో ఏం చేస్తారని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో మూడో కూటమికి అవకాశం లేదని చెప్పుకొచ్చారు. బిజెపితో గానీ కాంగ్రెసుతో గానీ కలవకుండా కేంద్రంలో ఇప్పటి వరకు వొక్క ప్రభుత్వం కూడా అధికారంలోకి రాలేదని ఆయన గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో రెండే కూటములు ఉంటాయని అవి కాంగ్రెస్, బీజేపీయే అని చంద్రబాబు తెలిపారు.