మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన రాహుల్...!

SMTV Desk 2018-12-26 12:51:10  Rahul Gandhi, Tamilnadu, Puducherry, Narendra Modi

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరిల బీజేపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడగా, ఇందులో ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నను మోదీ దాటవేశారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్‌ ఖాతాలో వ్యంగ్యంగా స్పందించారు. ‘బీజేపీ తనిఖీ చేసిన తర్వాతనే ప్రశ్నలను అనుమతించడం చాలా మంచి ఉపాయం. మోదీ చెప్పే సమాధానాలను కూడా ఆ పార్టీ తనిఖీ చేస్తే మరింత బాగుంటుంది అని రాహుల్‌ అన్నారు. ఓ టీవీ ఛానెల్ లో వచ్చిన కథనం ప్రకారం తమిళనాడుకు చెందిన ఓ కార్యకర్త మోదీని ‘మీ ప్రభుత్వం మధ్యతరగతి వారి నుంచి పన్నులు ఎక్కువగా వసూలు చేస్తూ వారి బాగోగులను ఎందుకు పట్టించుకోవడం లేదు? అని అడిగారు. వెంటనే మోదీ అతని ప్రశ్నను పక్కనబెట్టి పుదుచ్చేరి కార్యకర్తలతో సంభాషణ ప్రారంభించారు.

దీనిపై రాహుల్‌ ట్వీట్‌ చేస్తూ, ‘వణక్కం పుదుచ్చేరి! కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోదీ ఇచ్చిన బదులిదే. ఇకపై కార్యకర్తల ప్రశ్నలనే కాదు, మోదీ సమాధానాలను కూడా బీజేపీ తనిఖీ చేసుకుని అనుమతించాలి. మీడియా సమావేశంలో అడిగే ప్రశ్నలకే కాదు, తమ పార్టీ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కూడా మోదీకి చేతకాదు అని విమర్శించారు.