మళ్ళీ ఏటీఎంల ముందు క్యూ కట్టాల్సిందేనా...??

SMTV Desk 2018-12-26 11:13:24  Indian banks, Government Holidays, Strike, Bank employees, ATM

హైదరాబాద్, డిసెంబర్ 26: ఈ నెల 21 నుండి 26 వరకు బ్యాంక్ లకు వరుసగా సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు న్యూ ఇయర్ సెలవులు కూడా రాబోతున్నాయి. వీటికితోడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె కూడా మొదలుపెట్టారు. ఇక ఏటీఎంలలో డబ్బులు దొరకక ఇబ్బంది పడాల్సిందే అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు తాజాగా వివరణ ఇచ్చారు. వరుస సెలవులు, బ్యాంకు ఉద్యోగుల సమ్మె వల్ల నగదు కొరత ఏర్పడకుండా ఖాతాదారుల కోసం ఏటీఎంలలో డబ్బులు పెట్టినట్లు బ్యాంకు ఉన్నతాధికారులు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో 3,969 ఏటీఎంలుండగా వీటిలో 85 శాతం ఏటీఎంలలో నగదు ఉంచామని అధికారులు చెప్పారు.

హైదరాబాద్ నగరంతోపాటు గ్రామాలు, పట్టణప్రాంతాల్లోని ఏటీఎంలలోనూ నగదు కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు వివరించారు. వరుస సెలవులతో పాటు బ్యాంకు ఆఫ్ బరోడా, విజయాబ్యాంకు, దేనాబ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతోపాటు క్రిస్మస్, ఇతర సెలవులతో ఖాతాదారులకు నగదు కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఏటీఎంలలో నగదును నింపామని వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు వివరించారు.