నగరంలో మరో దొంగ బాబా అరెస్ట్

SMTV Desk 2018-12-25 15:38:10  Hyderabad city, Fruad business, Gireesh singh, Cyber crime, Spritual guru, Startup companys, Advita kiya giresh

హైదరాబాద్, డిసెంబర్ 25: నగరంలో మరో దొంగ బాబా బయటకి వొచ్చాడు. జనాలకు మాయమాటలు చెప్పి వారిని ఆకర్షించుకొని దాదాపు రూ.60కోట్లు దోచేశాడు. చివరకు సైబరాబాద్ పోలీసులకు చిక్కాడు. అంతేకాక పోలీసుల విచారణలో ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడించాడు. అమెరికాకు బిల్ గేట్స్ ఉన్నాడు, జపాన్‌కు తడాషి యానాయి, చైనాకు జాక్ మా వీరంతా ఆయా దేశాల్లో శ్రీమంతులు వారిలాగా తాను కూడా ఇండియాలో శ్రీమంతుడిగా ప్రచారం చేసుకున్నాడు.

పోలీసుల వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన గిరీశ్ సింగ్ చదివింది కేవలం ఇంటర్. అతనికి పురాణాలు, కథల పట్ల అవగాహన చిన్నప్పటి నుంచే ఉంది. వాటిని అవకాశంగా తీసుకొని తాను దేవీ పుత్రుడునని తాను ఏది చెబితే అది జరుగుతుందని ప్రజలను నమ్మించాడు. 2024లో దేశ ప్రధాని కూడా తానే అవుతానని చెప్పడం మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో మకాం ఏర్పాటు చేసుకొని కొద్ది రోజుల్లో ఆధ్మాత్మిక గురువుగా ప్రాచుర్యం పొందాడు. అనంతరం తన దగ్గరకు వచ్చే భక్తుల సమస్యలను బట్టి కుబేర ప్రక్రియ, అమృత ప్రక్రియ, ధన్వంతరీ ప్రక్రియ, కళ్యాణ ప్రక్రియ, సంతాన ప్రక్రియ పేర్లతో క్లాసులు తీసుకునేవాడు. వొక్కో క్లాసుకి రూ.10వేల నుంచి రూ.2లక్షల వరకు వసూలు చేసి ఇలా కోట్లు ఆర్జించాడు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో రూ.3కోట్లు ఖర్చు చేసి దివ్య అనే యువతిని వివాహం కూడా చేసుకున్నాడు.

ఈ సంపాదన సరిపోలేదంటూ డ్రిమ్‌ బ్రిడ్జ్‌ సోషల్‌ ట్రేడ్‌, గిరీశ్‌ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ, ఎయిర్‌ లైన్‌ గోల్డ్‌, అండ్‌ డైమండ్‌ బిజినెస్‌ ఇలా 30 స్టార్టప్‌ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నాడు. వాటికి డైరెక్టర్లుగా తన భార్య దివ్యను, తమ్ముడిని నియమించాడు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెడితే 3 నుంచి 6నెలల్లోనే కోటీశ్వరులు కావొచ్చంటూ నమ్మించాడు. తన వద్ద రూ. 1100 నుంచి రూ. 66వేల వరకు వివిధ రకాల యూజర్‌ ఐడీలు ఉన్నాయని.. వొక్కో ఐడీ కొనుగోలు చేసిన వారు వారికింద ఇద్దరు వ్యక్తులను చేర్పించాలని నిబంధన పెట్టాడు. వారు వొక్కొక్కరు మరో ఇద్దరిని చేర్పించాలి. ఇలా చేర్పిస్తూ పోతే అధిక మొత్తంలో కమీషన్‌ ఇస్తానని.. 10వ లెవల్‌కు వెళ్లేసరికి రూ.లక్ష పెట్టుబడి పెట్టిన వ్యక్తికి రూ. కోటి ఆదాయం వస్తుందని నమ్మించాడు.

అప్పటికే అతడి మాయలో పడిపోయిన భక్తులు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టారు. కొందరైతే రూ.2 నుంచి 4కోట్ల వరకూ ముట్టజెప్పారు. ఇలా ఏడాదిలోనే భక్తుల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రూ. 60 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. మోసపోయిన భక్తులు పోలీసులను ఆశ్రయించడంతో.. నిందితుడిని అరెస్టు చేశారు.