మహాకూటమి ఆశలకు చెక్‌ పెడుతున్న బీఎస్పీ..!

SMTV Desk 2018-12-25 12:26:47  Mahakutami, BSP, Congress

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి మహాకూటమిగా బరిలోకి దిగాలన్న కాంగ్రెస్‌ ఆశలకు బీఎస్పీ గండికొట్టింది. ఇప్పటకే యూపీలో కాంగ్రెస్‌ను దూరం చేస్తూ ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్డీలు పొత్తు పెట్టుకున్నాయి అన్న వార్తలు ఆ పార్టీని నిరుత్సాహానికి లోనుచేశాయి. కాగా మధ్యప్రదేశ్‌లో జరగబోయే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ అన్ని స్ధానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించి కూటమి ఆశలను ఆవిరి చేసింది. బీఎస్పీ ఉపాధ్యక్షుడు రాంజీ గౌతమ్‌ మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 లోక్‌సభ స్ధానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇటీవల ముగిసిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఎస్పీ వేర్వేరుగా పోటీ చేసాయి. అయితే మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె సహకరించారు. ఈ క్రమంలో బీఎస్పీ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

కూటమి కష్టాలు ఇలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేస్తూ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వొడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలతో ఇప్పటికే భేటీలు జరిపి ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఓ రూపు, ఊపు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తంమీద రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ సర్కార్‌ను ఢీ కొట్టేందుకు మహాకూటమి ఆశలు ఎంతమేరకు ఫలిస్తాయన్నది ఉత్కంఠగా మారింది.