దోషులను కనికరం లేకుండా కాల్చి పారేయాలంటున్న సీఎం..!

SMTV Desk 2018-12-25 11:03:39   JDS, Activist died, hd kumara swamy, Controversial comments

బెంగుళూరు, డిసెంబర్ 25: జనతాదళ్‌ (ఎస్‌)కు చెందిన ఓ కార్యకర్త దారుణ హత్యకు గురి కాగా, ఆ విషయం తెలుసుకున్న కర్ణాటక సీఎం కుమారస్వామి దోషులను కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ నోరుజారారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో సీఎం వ్యాఖ్యలపై విమర్శల వర్షం కురుస్తోంది. హొణ్నలగెరె ప్రకాశ్‌ అనే నేతను నిన్న సాయంత్రం బైక్ పై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు, మద్దూర్‌ వద్ద అడ్డుకుని విచక్షణా రహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాల పాలైన ప్రకాశ్, చికిత్స పొందుతూ మరణించారు.

దీనిపై స్పందించిన సీఎం కుమారస్వామి, దోషులను పట్టుకుని కనికరం లేకుండా కాల్చి పారేయాలంటూ ఆదేశించారు. కాగా సీఎం వైఖరిపై విమర్శలు వచ్చాయి. దీంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కుమారస్వామి, మరణాన్ని చూసిన ఆగ్రహంతో ఆ వ్యాఖ్యలు చేశానే తప్ప, పోలీసులకు ఆదేశాలు ఇవ్వలేదుఅన్నారు. ప్రకాశ్ ను హత్య చేసిన వారు, గతంలో రెండు హత్య కేసుల్లో నిందితులని, వారు ఇటీవలే బెయిల్ పై విడుదలై వచ్చారని తెలిపిన కుమారస్వామి, నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామని అన్నారు.