కోల్‌కతా చేరుకున్న సీఎం కేసీఆర్‌.!

SMTV Desk 2018-12-24 18:24:31  K Chandrashekar Rao, Federal Front, mamata banerjee

కోల్‌కతా, డిసెంబర్ 24: కాంగ్రెస్ మరియు బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకువస్తానన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ ఆదివారం వొరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ అయిన కేసీఆర్‌.. ఈరోజు మధ్యాహ్నం కోల్‌కతా చేరుకున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు విషయమై పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సెక్రటేరియట్‌కు చేరుకున్న కేసీఆర్‌ను మమత సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ భేటీ అనంతరం కేసీఆర్ కోల్‌కతాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి బయల్దేరి వెళతారు. అక్కడే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ,బీఎస్పీ పార్టీ అధినేతలు, మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌ యాదవ్‌, మాయావతిలను కలుస్తారు.

కాగా రానున్ను సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మొదట కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలిపారు. అయితే ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల సీఎంల(కాంగ్రెస్‌) ప్రమాణస్వీకారోత్సవానికి ఆమె హాజరుకాకపోవడంతో ప్రస్తుతం కేసీఆర్‌తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.