చింతమనేని అనుచరులపై ఫిర్యాదు చేసిన సినీ నటి

SMTV Desk 2018-12-24 17:27:13  Chinthamaneni prabhakar, Dendulooru MLA, Cini actor, Apoorva, Cyber police, FIR, Chinthamaneni followers, Facebook

హైదరాబాద్, డిసెంబర్ 24: సోషల్ మీడియాలో తనపై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని సినీనటి అపూర్వ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తనను మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు అపర్వ. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆమె వాపోయారు. ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు చేస్తున్న ఆరోపణల్లో వొక్కటి నిజం అయిన తనను నడిరోడ్డుపై ఉరితీయండన్నారు. 10ఏళ్ల నుంచి వొకే నంబర్ వాడుతున్నానని అవసరమైతే తన కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై తనకెలాంటి ద్వేషం లేదన్నారు. ఆయన మంచివారే కానీ ఆయన వెనక ఉన్నవారే నీచ రాజకీయాలు చేస్తున్నారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు అపూర్వ. గత కొంతకాలంగా సినీనటి అపూర్వ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పలు ఆరోపణలు చేశారు. అపూర్వ సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు.

దెందులూరులో ఆమెకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమి సరిహద్దులకు సంబంధించి గత కొంతకాలంగా పక్కనే ఉన్న పొలాల రైతులకు ఆమె కుటుంబ సభ్యులకు వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నిసార్లు కొలతలు వేసినా సరిహద్దులు గుర్తించినా కొందరు తమ పొలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె ఆరోపించింది. ఇటీవలే తన భూమికి సంబంధించి సర్వే చేయించి సరిహద్దులు రాళ్లు వేయించారు అపూర్వ. అయితే వాటిని సైతం పక్క పోలాల రైతులు తొలగించారు. సరిహద్దు రాళ్లు తొలగించడమే కాకుండా దుర్భాషలాడటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనకు తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు తన భూమిని కబ్జా చెయ్యాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వారి వెనుక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందంటూ పరోక్షంగా చింతమనేని ప్రభాకర్ పై పలు ఆరోపణలు చేసింది. చింతమనేనికి భయపడి కూడా పోలీసులు ఏమీ చెయ్యలేకపోతున్నారంటూ ఆమె వాపోయారు. అప్పటి నుంచి అపూర్వపై చింతమనేని అనుచరులు అభిమానులు టార్గెట్ చేశారని వాపోయింది. సోషల్ మీడియా వేదికగా తనను వేధిస్తున్నారని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆమె పోలీసుల ఎదుట చెప్పుకొచ్చారు.