రాజస్ధాన్‌లో 23 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం.!

SMTV Desk 2018-12-24 16:36:31  Cabinet ministers, Rajasthan, Swearing- in ceremony, Ashok Gehlot

జైపూర్‌ : ఈ మద్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టింది. కాగా, కొత్తగా కొలువుతీరిన రాజస్థాన్‌ ప్రభుత్వంలో 23 మంది మంత్రులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 22 మంది కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కాగా ఆర్‌ఎల్డీ నుంచి వొకరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 13 మంది కేబినెట్‌ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులచే గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

రాజస్ధాన్‌ ముఖ్యమంత్రిగా అశోక్‌ గెహ్లోత్‌, డిప్యూటీ సీఎంగా సచిన్‌ పైలట్‌లు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 17న రాజస్ధాన్‌ సీఎం, డిప్యూటీ సీఎం అశోక్‌ గెహ్లోత్‌, సచిన్‌ పైలట్‌లు మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ సహా అధిష్టాన పెద్దలతో మూడు రోజుల పాటు విస్తృత సంప్రదింపులు జరిపారు. తీవ్ర తర్జనభర్జనలు, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల ఎంపికపై కసరత్తు పూర్తిచేశారు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ సహా 30 మందికి మంత్రులుగా అవకాశం ఉండగా మిగిలిన మరికొన్ని మంత్రి పదవులను తర్వాత విస్తరణలో భాగంగా భర్తీచేస్తారని భావిస్తున్నారు.