శబరిమలలో మరోసారు ఉద్రిక్తత వాతావరణం

SMTV Desk 2018-12-23 16:18:40  Shabarimala Temple, Supreem court, Women , Ayyappa devotees

కేరళ, డిసెంబర్ 23: శబరిమల ఆలయంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. సుప్రీం కోర్ట్ మహిళలను ఆలయ లోపలికి ప్రవేశించాలని తీర్పు ఇచ్చినా...అక్కడి స్వామి భక్తులు మాత్రం దీనికి వొప్పుకోవడం లేదు. తాజాగా ఆదివారం ఉదయం తమిళనాడు నుంచి వచ్చిన 11 మంది మహిళా భక్తుల బృందం ఆలయానికి చేరుకునేందుకు ప్రయత్నించడంతో అయ్యప్ప భక్తులు అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వీరంతా తమిళనాడుకు చెందిన మహిళా హక్కుల సంస్థ ‘‘మణితి కి చెందిన సామాజిక కార్యకర్తలు. ఆలయానికి మొదటి బేస్ క్యాంపు వద్ద వీరిని భక్తులు అడ్డుకోవడంతో మణితి సంస్థ నాయకురాలు సెల్వితో పోలీసులు చర్చలు జరిపారు. అయ్యప్పను దర్శించకుండా వెళ్లేది లేదని వారు భీష్మించుకుని కూర్చోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. తొలుత పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే తాము ఇక్కడికి వచ్చినట్టు వారు తెలిపారు.

ఆలయంలోకి ప్రవేశించేందుకు మరో 40మంది మహిళలు ఇప్పటికే కొట్టాయం, ఎరుమెలి ప్రాంతాల్లో బృందాలుగా సంచరిస్తున్నారని వారు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితి చేయి దాటకుండా కొండపైకి వెళ్లే బస్సు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆలయ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు కొద్దిరోజుల క్రితం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిని అమలు చేసి తీరుతామని కేరళ ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన తర్వాత నవంబర్ 17న తొలిసారి ఆలయం తెరిచిన నాటి నుంచి నేటి వరకు అక్కడ ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. మరోవైపు ఈ తీర్పును పున:సమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై జనవరి 22న విచారణ జరగనుంది.