కాంగ్రెస్ కి మరో షాక్ : శాసనమండలిలో ప్రతిపక్ష హోదాను కోల్పోయిన కాంగ్రెస్

SMTV Desk 2018-12-22 19:11:26  TRS, Congress party, Opposition party

హైదరాబాద్, డిసెంబర్ 22: తెరాస ప్రభుత్వం కాంగ్రేస్ కి మరో షాక్ ఇచ్చింది. తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. ఈ మేరకు శనివారం నాడు మండలి సెక్రటరీ నరసింహచార్యులు బులెటిన్ విడుదల చేశారు.

శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసిన ప్లాన్ సక్సెస్ అయింది. గత టర్మ్‌లో శాసనమండలిలో టీడీపీ ని కూడ ఇదే రీతిలో దెబ్బతీసింది. ప్రస్తుతం ఇదే తరహలో కాంగ్రెస్ పార్టీని కూడ టీఆర్ఎస్ దెబ్బతీసింది. కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్సీలు తమను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాలని కోరుతూ డిసెంబర్ 21వ తేదీన లేఖ ఇచ్చారు. ఈ లేఖకు అనుగుణంగా ఈ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తూ మండలి సెక్రటరీ డిసెంబర్ 21వ తేదీ సాయంత్రం బులెటిన్ విడుదల చేశారు. ఈ బులెటిన్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షం టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనమైంది. తెలంగాణ మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ఇందులో కనీసం 10 శాతం సభ్యులు ఉంటే ప్రతిపక్ష హోదా దక్కుతోంది. అంటే కనీసం నలుగురు ఎమ్మెల్సీలు ఉండాలి. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎన్నికలకు ముందు దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రావులు టీఆర్ఎస్‌లో చేరారు. వీరిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినట్టు కూడ ప్రకటించింది.

డిసెంబర్ 21వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్ కుమార్ లు కూడ టీఆర్ఎస్‌లో చేరారు. అంతకుముందు రోజు రాత్రి ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలిశారు. ఈ నలుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలని లేఖ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీకి మండలిలో విపక్ష హోదాతో పాటు ఆ పార్టీకి ప్రాతినిథ్యం లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీల్లో ఇప్పటికే నలుగురు టీఆర్ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు మాత్రమే మిగిలారు. వీరిద్దరి పదవి కాలం వచ్చే ఏడాది మార్చి వరకే ఉంది. ఈ నలుగురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం కావడంతో మండలిలో ఇద్దరు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. దీంతో మండలిలో కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా కోల్పోయింది. విపక్ష హోదా దక్కాలంటే కనీసం నలుగురు ఎమ్మెల్సీలు అవసరం. మండలిలో విపక్ష హోదా కోల్పోయినట్టుగా కూడ మండలి సెక్రటరీ నర్సింహచార్యులు డిసెంబర్ 22వ తేదీన బులెటిన్ విడుదల చేశారు.