త్వరలో రంగంలోకి డ్రోన్ కెమరాలు

SMTV Desk 2018-12-22 17:51:00  Hyderabad city police, Drone cameras, CC Cameras

హైదరాబాద్, డిసెంబర్ 22: అభివృద్ధి రంగంలో హైదరాబాద్ మహానగరం ఎప్పటికప్పుడు ముందడుగు వేస్తూనే వుంది. నేరాల విభాగంలో నగరంలో ఇప్పటికే అక్కడక్కడ సిసి కెమెరాలను ఏర్పాటు చేయడంతో ఎక్కడ ఏ నేరం లేదా అవాంఛనీయఘటన జరిగినా పోలీసులకు వెంటనే తెలిసిపోతోంది. దాంతో సులువుగా నేరస్తులను పట్టుకోగలుగుతున్నారు. ఇప్పుడు వారు సిసి కెమెరాలకు తోడు డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించుకోవడానికి సిద్దం అవుతున్నారు. సిసి కెమెరాలు కేవలం వొక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతాయి. కానీ గాలిలో ఎగిరే డ్రోన్ కెమెరాలను కావలసిన ప్రదేశాలకు పంపించి ఫోటోలు, వీడియోలు తీయవచ్చు.





సిసి కెమెరాలకు భయపడని నేరస్తులు కూడా పైన ఎగురుతున్న డ్రోన్ కెమెరాలను చూసి భయపడకమానరు. కనుక నేరాలను అదుపు చేయడం ఇంకా సులువు అవుతుంది. ప్రస్తుతం నగరంలో కొన్ని ప్రధాన కూడళ్లలో పోలీసులు వీటిని ప్రయోగాత్మకంగా నడిపించి చూస్తున్నారు. డ్రోన్ కెమెరాలు ఇప్పటికే పలు దేశాలలో పోలీసులు విజయవంతంగా ఉపయోగిస్తున్నారు కనుక త్వరలోనే నగరంలో కూడా డ్రోన్ కెమెరాలు పహరా కాస్తూ కనబడవచ్చు.

హైదరాబాద్‌ పోలీసులే కాదు జీహెచ్ఎంసి కూడా డ్రోన్ కెమెరాలను ఉపయోగించుకోవడానికి సిద్దం అవుతోంది. నగరంలో అక్రమ కట్టడాలను గుర్తించడానికి, వివిద ప్రాంతాలలో జరిగే రోడ్ల మరమత్తుల పనులను పర్యవేక్షించడానికి, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆయా ప్రాంతాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇలా ఎన్ని రకాలుగానైనా డ్రోన్ కెమెరాలను ఉపయోగించుకోవచ్చు. కనుక మొదట హైదరాబాద్‌ నగరంలో ఆ తరువాత రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో డ్రోన్ కెమెరాలు ఎగురుతూ కనబడినా ఆశ్చర్యపోనవసరం లేదు.