నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.!

SMTV Desk 2018-12-22 11:37:19  National Herald House Case, AJL

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది, నేషనల్‌ హెరాల్డ్‌కు 56 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన భవనాన్ని ఖాళీ చేయాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.14 రోజుల్లోగా భవనాన్ని ఖాళీ చేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నేషనల్‌ హెరాల్డ్‌ పబ్లిషర్‌ అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌) హెరాల్డ్‌ హౌస్‌ను లీజుకు తీసుకుంది. పూర్తిగా కాంగ్రెస్ నియంత్రణలో ఉండే ఏజేఎల్ నేషనల్ హెరాల్డ్ పత్రికకు పబ్లిషర్స్‌గా ఉంది.

అయితే పత్రికా కార్యాలయం గత పదేళ్లుగా నడవడం లేదని, లీజు నిబంధనలు ఉల్లంఘించి వాణిజ్య కార్యకలాపాలకు ప్రాంగణాన్ని వినియోగిస్తున్నారని పేర్కొంటూ కేంద్రం లీజును రద్దు చేసింది. నవంబరు 17వ తేదీలోగా భవనాన్ని ఖాళీ చేయాలని అక్టోబరు 30న సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏజేఎల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది.