రూ.2 వేల నోటు రద్దు చేయనున్నారా?

SMTV Desk 2017-07-26 19:00:00  2000 RS NOTE , RAJYASABA, NARESH, DIPYOOTI CM KURIYAN

న్యూఢిల్లీ, జూలై 26 : ఇటీవల పెద్ద నోట్ల రద్దును మోదీ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత 2 వేల నోటును అమలు లోకి తెచ్చిన కేంద్రం, మళ్ళీ ఆ నోటును కూడా రద్దు చేసి దానికి బదులు కొత్తగా వెయ్యి రూపాయల నాణాన్ని తీసుకురానుందన్న విషయంపై ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని, రాజ్యసభ శూన్య గంటలో సమాజ్‌వాది‌ పార్టీకి చెందిన నరేశ్‌ అగర్వాల్‌ పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. ఆర్‌బీఐ రూ.3.2 లక్షల కోట్ల 2వేల నోట్లను ముద్రించిందని, ప్రస్తుతం ఈ నోట్ల ముద్రణను ఆర్‌బీఐ ఆపి వేసిందని నరేశ్‌ అగర్వాల్‌ సభకు తెలిపారు. ఇప్పటికే ఒకసారి నోట్లను రద్దు చేశారని, రెండోసారి కూడా అలాంటి ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందని అన్నారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వాలి అని డిమాండ్‌ చేశారు. దీనిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పీజే కురియన్‌ స్పందిస్తూ ‘అది ఆర్‌బీఐ చర్య కదా’ అని అనగా.. ఇది వరకు చేపట్టిన నోట్ల రద్దు నిర్ణయం కూడా ఆర్‌బీఐది కాదని నరేశ్‌ అగర్వాల్‌ అన్నారు. తొలిసారి నోట్ల రద్దు అంశాన్ని ఆర్‌బీఐ తిరస్కరించినప్పటికీ ప్రభుత్వం దాన్ని చేపట్టిందన్నారు. రెండోసారి కూడా ప్రభుత్వమే ఆ నిర్ణయం తీసుకుంటోందని తెలిపారు.