సముద్రం చుట్టూ గోడ... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

SMTV Desk 2018-12-20 20:07:49  Chandrababu, Pithani Satyannarayana, AP Government

అమరావతి, డిసెంబర్ 20: సముద్రం చుట్టూ గోడ కట్టడం ఏంట్రా అనుకుంటున్నారా, వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. ఏపీ ప్రభుత్వం సముద్ర తీరం లో పొడవైన గోడను నిర్మించి ప్రకృతి విలయాల నుంచి కొంతైనా నష్టాన్ని నివారించే దిశగా యోచన చేస్తోందని సమాచారం. ఏపీ 973 కిలోమీర్ల పొడవైన తీర ప్రాంతం కలిగిఉంది. దేశంలోనే రెండో(గుజరాత్ తర్వాత) అతి పొడవైన తీర ప్రాంతం కలిగున్న రాష్ట్రం మనది. తరచూ తుఫాన్లు రాష్ట్రం మీద విరుచుకుపడడంతో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగుతున్నాయి, తీరప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులతో పాటు సముద్రం కోతకు గురవుతోంది.


ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం పై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వైపరిత్యాలు తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో సముద్ర తీరంలో పొడవైన గోడ నిర్మించాలని ఆలోచిస్తోంది. 973 కిలోమీటర్ల తీర ప్రాంతంలో తీవ్రమైన ప్రభావం ఉన్న 150 కిలోమీటర్ల ప్రాంతంలో పొడవైన గోడ నిర్మించాలని ప్లాన్ చేస్తోందట. గతంలో సముద్రం విరుచుకుపడకుండా చాలా చోట్ల చెట్లను వరుసగా పెంచి హరిత బంధనం ఏర్పాటుకు ప్రయత్నించారు.. కానీ లాభం లేకపోయింది. అందుకే ఈ సారి చెట్లతో కాకుండా సముద్రానికి అడ్డుగా గోడ కట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపి, గోడ ఎత్తు, వెడల్పు ఎంత? ఏ ప్రాంతంలో నిర్మించాలి? అనే దాని పై చర్చలు జరుపుతామన్నారు.