హైదరాబాద్ లో 'మెట్రో మొబిలిటీ కార్డు’..!

SMTV Desk 2018-12-20 13:41:15  Metro Mobility card, Hyderabad

హైద‌రాబాద్, డిసెంబర్ 20: హైదరాబాద్ లో ప్రయాణికులు సులభతరమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నగర రవాణా విభాగాలు సంయుక్తంగా ముందడుగు వేశాయి. నగరంలో ట్రాఫిక్ రద్దీతో సతమతమయ్యే ప్రజలకు రైలు, రోడ్డు రవాణా సదుపాయాల్లో ఏది అందుబాటులో ఉంటే దానిలో సులువుగా ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొబైల్ రీచార్జ్ తరహాలో కామన్ ట్రావెల్ టికెట్ కార్డును, మెట్రో మొబిలిటీ కార్డు పేరుతో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నది. ఈ కార్డులోని బ్యాలెన్స్ మొత్తం ఖర్చయితే సులభంగా రీచార్జ్ చేసుకునేలా కార్డుని రూపొందించారు.

ఈ కార్డు ప్రయాణికుడి వద్ద ఉంటే మెట్రోరైలుతోపాటు, ఎంఎంటీఎస్, సిటీ ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలలో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఈ కార్డు ఉంటే చాలు వీటిలో ఏ ప్రయాణ సౌకర్యాన్నైనా వినియోగించుకునే వీలు కల్పించారు. కాగా ఈ కార్డు ప్రారంభ ధర రూ.1,000, రూ.2,000లలో లభించనున్నాయి. కార్డుకు ఎటువంటి చార్జీలు ఉండవు. ఎంఎంటీఎస్, మెట్రో ప్రయాణానికి కౌంటర్ల వద్ద క్యూలో నిల్చోవల్సి ఉండేది, ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడంతోపాటు మెరుగైన ప్రజారవాణా వ్యవస్థను తయారు చేయాలనే లక్ష్యంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.