'జాన్సన్ అండ్ జాన్సన్‌' బేబీ పౌడర్ లో క్యాన్సర్‌ పదార్థాలు...?

SMTV Desk 2018-12-19 20:10:39  Johnsons and johnsons baby powder, Cancer molecules,

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: ప్రముఖ జాన్సన్ అండ్ జాన్సన్‌ కంపెనీ లో తయారయ్యే బేబీ పౌడర్ లో క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలు ఉన్నట్లు ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక జరిపిన ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది. ఇప్పటికే పలుమార్లు జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్‌ను ల్యాబ్‌లో పరీక్షించగా యాస్బెస్టాస్ (నారరాయి పదార్థం) అందులో కలిసి ఉన్నట్లుగా తేలినట్లు ఆ ఆంధ్రపత్రిక వెల్లడించింది. ఇది దశాబ్దకాలంగా జరుగుతోందంటూ స్పష్టం చేసింది.
గతవారం దీనికి సంబంధించి ఓ కథనం ప్రచురితం కావడంతో జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల సేల్స్ దారుణంగా పడిపోయాయి. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ మాత్రం ఆ కథనం సత్యదూరం అని పేర్కొంది. అందులో వాస్తవాలు లేవని వెల్లడించింది. "జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌లో ఎలాంటి హానికరమైన పదార్థాలు లేవని దీనిపై ఎందరో ఎన్నో పరిశోధనలు చేశారు. పౌడర్ వల్ల ఎలాంటి క్యాన్సర్ కానీ నాపరాయి వల్ల వచ్చే వ్యాధులు కానీ రావని ఇప్పటికే దీనిపై స్టడీ చేసిన లక్షమంది పురుషులు మహిళలు చెప్పారు.
అంతేకాదు పౌడర్‌కు సంబంధించి పలు స్వతంత్ర సంస్థలు పరీక్షలు నిర్వహించి బేబీ పౌడర్‌లో ఎలాంటి యాస్బెస్టాస్ పదార్థం లేవని ధృవీకరించాయి" అంటూ జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ వొక ప్రకటన విడుదల చేసింది.
గతవారం ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంతో మనదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీజ్ చేసింది. దీనిపై ఇప్పటి వరకు భారత్‌లోని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇది కేవలం వొక్క హిమాచల్ ప్రదేశ్‌కే పరిమితం కాలేదు.. తెలంగాణలోని డ్రగ్ ఆఫీసర్ అక్కడ కూడా సీజ్ చేయాలని ఇన్స్‌పెక్టర్లను ఆదేశించారు. వార్త పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ శాంపిల్స్‌ను సేకరించి వాటిని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీచేసినట్లు తెలంగాణ డ్రగ్ ఆఫీసర్ తెలిపారు. వొకవేళ నిజంగానే ఇందులో హాని కలిగించే పదార్థాలు ఏమైనా ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొన్ని లక్షల మంది చిన్నారుల ఆరోగ్యంపై ఇది ప్రభావం చూపుతుందన్నారు.