‘చేంజింగ్ ఇండియా' ప్రతీ పేజీ మాట్లాడుతుంది : మన్మోహన్ సింగ్

SMTV Desk 2018-12-19 11:04:15  Manmohan Singh, Chasing india book

న్యూఢిల్లీ,డిసెంబర్ 19: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా, ప్రధానిగా పదేళ్ల పదవీకాలానికి సంబంధించిన పలు విషయాల గురించి ‘చేంజింగ్ ఇండియా పేరుతో ఓ పుస్తకం రాసారు. ఆ పుస్తకాన్నిఆవిష్కరించిన మన్మోహన్ మాట్లాడుతూ.. మీడియాతో మాట్లాడడానికి నేనెప్పుడూ భయపడలేదని, తాను అటువంటి ప్రధానిని కానని స్పష్టం చేశారు. మీడియాతో క్రమం తప్పకుండా టచ్‌లోనే ఉండేవాడినని అన్నారు. విదేశీ పర్యటనలకు ముందు, వచ్చిన తర్వాత ప్రతిసారి మీడియాతో మాట్లాడేవాడినని స్పష్టం చేశారు. ‘‘నేను మీడియాతో మాట్లాడడానికి భయపడే ప్రధానిని కాను అని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అన్నారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వొక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు.

ఐదు భాగాలుగా ఉన్న ‘చేంజింగ్ ఇండియా పుస్తకంలో తాను నిర్వహించిన మీడియా సమావేశాలకు సంబంధించిన విషయాలను, ఆర్థికవేత్తగా తన జీవితం, ప్రధానిగా పదేళ్ల పదవీకాలానికి సంబంధించిన పలు విషయాల గురించి ప్రస్తావించినట్టు మన్మోహన్ పేర్కొన్నారు. ‘‘ప్రజలేమో నన్ను మౌన ప్రధానిగా వర్ణిస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ పుస్తకంలోని ప్రతీ పేజీ అలాంటి వారి కోసం మాట్లాడుతుంది. ప్రధానిగా నేను సాధించిన విషయాలను గొప్పగా చెప్పాలనుకోట్లేదు, కానీ జరిగిన వాటి గురించి మాత్రం చక్కగా వర్ణించగలిగా అని మన్మోహన్ పేర్కొన్నారు