తల్లులందరికి సులభంగా బరువు తగ్గించుకునే ప్రణాళిక

SMTV Desk 2018-12-18 19:02:52  Loss weight diet

గర్భం దాల్చిన అనంతరం కొంత కాలం గడిచాక ఎక్కువ శాతం మహిళలు అధికంగా బరువు పెరుగుతారు. ఆ బరువ ఎంతకీ తగ్గకపోయేసరికి బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొన్ని ప్రదేశాల్లో కిలోల కొద్ది కొవ్వు అలాగే వుండి పోతుంది.
అయితే అవేం చెయ్యకుండా కేవలం ఇంట్లోనే వుండి రోజూ చేస్తున్న పనులతో కూడా బరువుని తగ్గించుకోవచ్చు అవి ఎలాగంటే...

1. ఉదయం సరైన అల్పాహారం తీసుకోండి

ఉదయం వేళ తీసుకొనే అల్పాహారం రోజు మొత్తం మీద తీసుకునే ఆహారంలో అత్యంత ముఖ్యమైనది. రోజు మొత్తం మీరు చేయాల్సిన పనులకు అవసరమైన శక్తిని అందించేది ఇదే. అంతేకాకుండా ఈ ఆహారంతో వచ్చే క్యాలరీలను కరిగించడానికి కావాల్సినంత సమయం మీ దగ్గర ఉంటుంది. అల్పాహారం తీసుకోవడం వల్ల మధ్యాహ్నం వేళ భోజన వేళకు మీరు ఆకలితో అలమటించే పరిస్థితే ఉండదు. దీనివల్ల మధ్యాహ్నం వేళ కాస్తంత తక్కువ పరిమాణంలో తిన్నా ఆరోగ్యకరమైన విలువలున్న ఆహారం తినే వీలుంటుంది. కానీ వొక విషయం గుర్తుంచుకోండి, మీరు ఉదయం ఇడ్లీ మరియు దోసె లేక రవ్వతో చేసిన ఉప్మా మరియు పోహా వంటి ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలి. ఇవి అదనంగా కొవ్వు పెరగకుండా కావాల్సిన శక్తినిచ్చే ఆహార పదార్ధాలుగా ఎన్నాళ్ల నుంచో గుర్తింపు పొందిన భారతీయ వంటకాలు.

2. భోజనం మానేయకండి

బరువు తగ్గడం కోసం భోజనం మానేయడం ఎంతమాత్రమూ మంచి పద్ధతి కాదు. అంతకు ముందు అధికంగా తిన్నామనే ఉద్దేశంతోనూ భోజనం మానేయడం అనుసరణీయం కాదు. తరవాత ఆకలి అధికంగా అనిపించి మామూలుగా కన్నా ఎక్కువ భోజనం చేసే ప్రమాదం లేకపోలేదు. కావల్సిన దానికన్నా అధిక కెలోరీలు ఉండే ఆహారం కూడా తీసుకునే అవకాశం ఉంది. నిర్ణీత విరామంతో తినడం జీవక్రియను సక్రమంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఆయుర్వేదం సూచించిన జీవన విధానాన్ని అనుసరించండి - సులభంగా జీర్ణమయ్యే తాజా పదార్ధాలతో వండిన ఆహారం తీసుకోండి. దీంతోపాటు ఓ గ్లాసు మజ్జిగ తాగడం మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

3. మరింత ఎక్కువ నడవండి

పై అంతస్తుకు వెళ్లడానికి లిఫ్ట్ ఉన్నప్పటికీ మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి. మీరు షాపింగుకు వెళ్లినప్పుడు మీ వాహనాన్ని కాస్త దూరంగా నిలిపి నడుస్తూ దుకాణానికి వెళ్లండి. చీకటి పడేవేళ మీకు సమీపంలో ఉన్న ఉద్యానవనం వరకు వెళ్లి కాస్త సేదదీరండి. మీ నడుంచుట్టూ అధిక కొవ్వు పేరుకుపోకుండా జాగ్రత్తపడటానికి ఇలాంటి పనులు సహాయపడతాయి.

4. బద్ధకం పెంచే అలవాట్లు వదిలించుకోండి

మధ్యాహ్నం వేళ మీ బుజ్జాయిని నిద్రపుచ్చుతూ మీరు కూడా చిన్నకునుకు తీయడం మామూలే. అయితే ఇలాంటి అలవాటును మానుకోండి. దీనికి బదులు తోటపని చేయడానికి ఈ సమయాన్ని వినియోగించండి. మీ స్నేహితులతో ఫోనులో కబుర్లు చెబుతూ అలా వొకచోటే ఉండిపోకండి. మీరు అటూ ఇటూ తిరుగుతూ కూడా ఆ పని చేయొచ్చు. బోర్ కొడుతున్న వేళ ఏదో వొకటి తింటూ టీవీ చూసే పని మానేయండి. ఇలాంటప్పుడు మీకు తెలియకుండానే మీరు అవసరం లేని జంక్ ఫుడ్ అధికంగా తినేస్తుంటారు.

5. సరిపోయేంత నిద్రపోండి

మీ పిల్లలతో సమానంగా మీకు కూడా కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. మీరు సరిపడేంత నిద్ర పోయినప్పుడు మీలో వొత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండటంతో మీ పనులన్నీ సక్రమంగా చేసుకోగలుగుతారు. ఎవరైతే రాత్రివేళ సరిపోయేంత నిద్రపోరో వారు అధిక బరువు కలిగి ఉంటారని ఇటీవల పరిశోధనల్లో తేలింది.

జీవన విధానంలో చిన్నచిన్న మార్పులే చాలా వ్యత్యాసాన్ని చూపిస్తాయి. మంచం మీద ఎక్కువ సేపు పడుకుని ఉండటం అంటే మీ బరువు పెంచుకోవడానికి మీరే కారణమవుతారు. రోజంతా చురుగ్గా ఉండటం అనేది మీ జీవక్రియను మెరుగు పరుస్తుంది. దుస్తులు ఉతకడం లేదా అంట్లు తోమడం మరియు గచ్చు శుభ్రపరచడం వంటివి శరీర బరువును తగ్గించడంలో ఎంతో దోహదపడతాయి.