రూ.650 కోట్ల విద్యుత్ బిల్లులను మాఫీ చేసిన బీజేపీ...!

SMTV Desk 2018-12-18 18:51:45  BJP, Congress party, Madhyapradesh CM, Gujarath CM, Chattishghar CM

గాంధీనగర్, డిసెంబర్ 18: తాజాగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ పార్టీ సోమవారం మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణం చేసిన రెండు గంటల్లోనే కమల్‌నాథ్ రైతుల రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే.ఆ వెంటనే చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. అయితే దానికి దీటుగా గుజరాత్‌ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం సుమారు రూ.650 కోట్ల విలువైన విద్యుత్ బిల్లులను మాఫీ చేసింది. గ్రామీణ ప్రాంత గృహాలకు ఈ మాఫీ వర్తిస్తుంది. దీంతో మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మోదీపై ఎదురు దాడికి దిగారు. దేశవ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేసే వరకు మోదీని నిద్రపోనివ్వనని ఆయన అన్నారు. ఇది వివిధ రాష్ర్టాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలను డిఫెన్స్‌లో పడేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఈ నిర్ణయం వల్ల గుజరాత్‌లోని 6.22 లక్షల గ్రామీణ విద్యుత్ వినియోగదారులు లబ్ధి పొందనున్నట్లు గుజరాత్ ఇంధన శాఖ మంత్రి సౌరభ్ పటేల్ వెల్లడించారు. ఇందులో గృహ, వ్యవసాయ, వాణిజ్య కనెక్షన్లు ఉన్నట్లు చెప్పారు.