మోడీ పై ఆసక్తికర వాఖ్యలు చేసిన రాహుల్

SMTV Desk 2018-12-18 14:18:32  Narendra modi, Rahul gandhi, Intresting comments on modi, Demonitaization

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఇవాళ పార్లమెంటుకు చేరుకున్న వెంటనే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ పై నిప్పులు చెరిగారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిద్రపోనివ్వబోమని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలు కేవలం ఆరు గంటల్లో రైతు రుణాలను మాఫీ చేసినట్టు పేర్కొన్నారు. అలాగే రాజస్థాన్‌ రైతులకు కూడా త్వరలోనే ఊరట కల్పిస్తామన్నారు. ఇటీవల మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని రైతుల విజయంగా ఆయన అభివర్ణించారు. ప్రధాని మోదీ నాలుగేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ పేద రైతులకు వొక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. కానీ తన మిత్రుల జేబుల్లో మాత్రం రూ.3,500 కోట్లు అప్పనంగా పెట్టేశారు.. అని రాహుల్ ఆరోపించారు.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నిటిలోనూ రైతుల రుణాలను మాఫీ చేస్తామనీ... దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కూడా రైతులకు న్యాయం జరిగేలా బీజేపీపై వొత్తిడి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల రుణాలు మాఫీ చేసేవరకు ప్రధాని మోదీని నిద్రపోనివ్వం, ప్రశాంతంగా కూర్చొనివ్వం... అని కాంగ్రెస్ అధినేత స్పష్టం చేశారు. ప్రధానమంత్రికి కేవలం తన 15 మంది పారిశ్రామిక మిత్రుల యోగ క్షేమాలే కనిపిస్తున్నాయనీ... రైతుల కష్టాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తద్వారా ప్రధాని మోదీ ఈ దేశాన్ని రెండుగా విభజిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. మీకు ఓ వైపు రైతులు, పేదలు, యువకులు, చిన్న తరహా వ్యాపారులు... మరోవైపు దేశంలోని అతిపెద్ద వ్యాపారవేత్తలైన 15 మంది ఉన్నారు... అని రాహుల్ ఎద్దేవా చేశారు. 2016లో పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆయన అన్నారు. నోట్లరద్దుతో పేదల నుంచి డబ్బు దొంగిలించి, సంపన్నులకు ఇచ్చారు.. అని రాహుల్ ఆరోపించారు.