మూగ జీవుల్ని బలిగొన్న ప్రముఖ కెమికల్స్ కంపెనీ

SMTV Desk 2018-12-17 18:25:20  Naitrick acid plant, Hindusthan organic chemical company, monkeys , pigeons

మహారాష్ట్ర, డిసెంబర్ 17: రాయ్‌గఢ్ జిల్లాలో ఓ నైట్రిక్ యాసిడ్ ప్లాంట్ నుంచి విష వాయువు లీకై 31 కోతులు..4 పావురాలు మృత్యువాతపడ్డాయి. హిందూస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ కంపెనీ నుండి విషవాయువులు వెలువడటంతో 35 మూగ జీవాలు బలైపోయాయి. న్వెల్ తాలూకా పోశ్రీ ప్రాంతంలో డిసెంబర్ 13 రాత్రి ఈ ఘటనతో వాటి మృతదేహాలను కంపెనీ ప్రాంతంలోనే పాతి పెట్టినట్లుగా తెలుస్తోంది. కాగా సదరు కంపెనీ ఈ అంశాన్ని కప్పిపుచ్చేందుకు యత్నించిందనే ఆరోపణలు వస్తున్నాయి.

కాగా ఇక్కడికి 10 కిలోమీటర్ల దూరంలోనే కర్నాల పక్షి సంరక్షణ కేంద్రం ఉంది. హెచ్‌వోసీఎల్ అధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఇటీవలే ఇస్రోకు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కు బదలాయించారు.





అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఈ మూడు సంస్థలు స్పష్టంచేశాయి. అటవీ అధికారుల సమాచారంతో మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని తనిఖీ చేశారని, సిబ్బంది పాతిపెట్టిన కోతులు, పావురాల మృతదేహాలను వెలికితీసినట్లు అటవీ సంరక్షణాధికారి కేఆర్ కదమ్ తెలిపారు. వాటికి శవపరీక్ష నిర్వహించిన అనంతరం, తదుపరి పరీక్షల నిమిత్తం హాఫ్‌కిన్స్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించినట్లు కదమ్ తెలిపారు.

మూగ జీవాలు బలైపోయిన ఘటన దురదృష్టకరమని.. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించామని రాయ్‌గఢ్ జిల్లా కలెక్టర్ విజయ్ సూర్యవంశీ వెల్లడించారు.