2018 మిస్ యూనివర్స్‌గా క్యాట్రియోనా

SMTV Desk 2018-12-17 18:22:44  2018 Miss universe, Catriona Gray

బ్యాంకాక్, డిసెంబర్ 17: నగరంలో జరిగిన 2018 విశ్వ సుందరి పోటీల్లో ఫిలిప్సీన్స్‌కు చెందిన క్యాట్రియోనా ఎలీసా గ్రే విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో ఫస్ట్‌ రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తమారిన్‌ గ్రీన్‌, రెండో రన్నరప్‌గా వెనిజువెలాకు చెందిన స్టిఫెనీ గ్యూటెరెజ్‌ నిలిచారు. భారతదేశానికి చెందిన నేహల్‌ చూడాసమా టాప్‌ 20లోనూ స్థానం దక్కించుకోలేకపోయారు. విశ్వ సుందరిగా గెలిచిన క్యాట్రియోనా ఎరుపు రంగ గౌనులో అందంగా ముస్తాబయ్యారు. 2017లో విశ్వసుందరి కిరీటం అందుకున్న దక్షిణాఫ్రికా భామ డెమీ లీ నెల్‌పీటర్స్‌ తన కిరీటాన్ని క్యాట్రియోనాకు పెట్టారు.

ఈ కాంటెస్ట్‌లోని ఆఖరి రౌండ్‌లో న్యాయనిర్ణేతలు.. జీవితంలో మీరు నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఏంటి? అని క్యాట్రియోనాను అడిగారు. ఇందుకు ఆమె సమాధానమిస్తూ.. మనీలాలోని మురికివాడల ప్రాంతాలకు వెళుతూ అక్కడివారికి నాకు తోచిన సాయం చేస్తుంటాను. అలాంటి విషయాల్లోనే నేను అందాన్ని వెతుక్కుంటాను. ఈ మిస్‌ యూనివర్స్‌ పోటీల ద్వారా మనీలాలోని మురికివాడల్లో నివసిస్తున్న వారి జీవితాలను బాగుచేయాలని అనుకుంటున్నాను. అక్కడి పిల్లలకు చదువు చెప్పాలనుకుంటున్నాను. అని చెప్పి న్యాయనిర్ణేతల మనసులు దోచుకున్నారు.