టీడీపీకి అక్కడ పట్టిన గతే ఇక్కడ పడుతుంది : రోజా

SMTV Desk 2018-12-12 11:50:45  Roja, Chndrababu, Jaganmohan Reddy, Jr.NTR, Kalyanram, KCR, YSR

విజయవాడ, డిసెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీని కాపాడుకోలేక పోయారని, ఇక దేశాన్ని ఏం కాపాడుతారని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణాలో టీడీపీ, కాంగ్రెస్ మహాకూటమి ఓటమితో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏపీలో చంద్రబాబు అరాచకాలను విని, అక్కడ టీఆర్ఎస్ కు ఓటు వేశారని చెప్పారు. ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోవడం ఆశ్చర్యంగా ఉందని తెలిపారు. ఏపీలో కూడా టీడీపీని తిప్పి కొడతారని అన్నారు. మీడియా, డబ్బు అండతో ఎన్నికల్లో గెలవాలనే చంద్రబాబు ప్రయత్నాలు ఫలించబోవని చెప్పారు.

చంద్రబాబు కుట్ర రాజకీయాలని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు గుర్తించారని చెప్పారు. నందమూరి సుహాసిని రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశారని ఆమె వ్యాఖ్యానించారు. లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోవాలని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీ తల లేని మొండెం వంటిదని రోజా చెప్పారు. జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టించిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. . కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన విధంగానే, జగన్ ను ఏపీ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. జగన్ వల్లే రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని సూచించారు.