సరికొత్త రికార్డ్ సృష్టించిన కెసిఆర్.!

SMTV Desk 2018-12-11 17:32:56  KCR, NTR, Chandrababu, Kotla Vijay Baskar Reddy

హైదరాబాద్, డిసెంబర్ 11: గతంలో తెలుగు రాష్ట్రాల్లో ముందుస్తు ఎన్నికలకు దిగిన ముగ్గురు సీఎంలు ఓడిపోయారు. అయితే టీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ముందస్తు ఎన్నికలను తనకు అనుకూలంగా మలచుకుని ఘన విజయాన్ని సాధించారు. ఆరు నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఇదే ప్రెస్‌మీట్‌లో 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ప్రజా ఆశీర్వాద సభలు ఏర్పాటు చేసి టీఆర్‌ఎస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కూడిన ప్రజాకూటమి భారీ నష్టాన్ని చవిచూసింది. గత ఎన్నికల్లో సాధించిన సీట్లకన్నా ఎక్కువ సీట్లలో తెరాస సత్తాచాటింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన పార్టీలు చతికిల పడటమే తప్ప విజయం సాధించిన దాఖలు లేవు.


గతంలో కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు ముందస్తుకు వెళ్లి, ఓటమిని చవిచూశారు.1982లో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలిసారిగా ముందస్తుకు వెళ్లింది. అప్పటి సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి హైకమాండ్‌ అనుమతితో ఎన్నికలను ముందుకు జరిపారు.1983 ఆగస్టులో ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఆ ఏడాది జనవరిలోనే నిర్వహించారు. కానీ, టీడీపీ ప్రభంజనం ముందు కాంగ్రెస్‌ చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ పార్టీ 202 స్థానాలతో అధికారం చేపట్టింది. తదుపరి 1990 మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఎన్టీఆర్‌ 4 నెలల ముందుకు జరిపారు. ఈ ముందస్తు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2004 వరకూ అసెంబ్లీ గడువు ఉన్నా.. 2003 నవంబరులోనే అసెంబ్లీని అప్పటి సీఎం చంద్రబాబు రద్దు చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ మాత్రం ఎన్నికలను 2004లోనే జరిపింది. బాబు వ్యూహం ఫలించలేదు. వైఎస్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ జయభేరి మోగించింది. అంటే, ముందస్తుకు ప్రయత్నించిన కోట్ల, ఎన్టీఆర్‌, చంద్రబాబు ముగ్గురూ మహానాయకులు భంగపడ్డారనే చెప్పాలి.