ఊర్జిత్ పటేల్ రాజీనామా..!

SMTV Desk 2018-12-10 19:42:18  Urjith Patel, RBI Governor,

న్యూ ఢిల్లీ , డిసెంబర్ 10:కేంద్రం వ్యవహార శైలిపై అసంతృప్తితో వున్న ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకు మధ్య గత కొంత కాలంగా దూరం పెరిగిన సంగతి తెలిసిందే. రిజర్వ్ బ్యాంకులో ఉన్న నగదు నిల్వల్లో కొంత భాగాన్ని తమకు ఇవ్వాలంటూ కేంద్రం వొత్తిడి చేస్తోంది. ఈ ప్రతిపాదనను ఊర్జిత్ పటేల్ తో పాటు మరి కొందరు బోర్డు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఆయన రాజీనామా చేశారు. గతంలోనే ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం ఉదృతంగా సాగింది. కానీ అప్పుడు రాజీనామా చేయలేదు. ఇప్పుడు బహుశ ప్రభుత్వంతో వివాదం ముదిరిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి ఉంటారని ప్రజలు ఆర్ధిక వేత్తలు భావిస్తున్నారు.

ఇంత హటాత్తుగా ఊర్జిత్ ఎందుకు రాజీనామా చేశారన్న దానిపై మార్కెట్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. 2016 నుండి ఆర్బీఐ గవర్నర్‌గా విధులు నిర్వర్తించిన ఊర్జిత్ పటేల్ , మౌనంగా ఉండటానికే ఇష్టపడతారు. డీమానిటైజేషన్ తరువాత నుండి కేంద్రానికి ఆర్బీఐకి మధ్య సయోధ్య కొరవడిందన్న వాదనను ఊర్జిత్ సమర్ధవంతంగానే ఎదుర్కొన్నారు. తాజాగా రెండు నెలల క్రితం ఆర్బీఐ డైరెక్టర్ విరాల్ ఆచార్య చేసిన వివాదస్పద వాఖ్యలతో కేంద్రం ఆర్బీఐ మీద పెత్తనం చేస్తుందన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న మార్కెట్లు రేపు మంగళ వారం ఈ రాజీనామా వార్తతో మరింత నష్టాల్లోకి వెళ్ళే ప్రమాదం లేక పోలేదు.

రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు ఇవే.

వ్యక్తిగత కారణాల వల్ల ఆర్బీఐ గవర్నర్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. రిజర్వ్ బ్యాంకుకు గత కొన్నేళ్లుగా వివిధ హోదాల్లో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నా. రిజర్వ్ బ్యాంక్ సాధించిన ఘనత వెనుక ఆర్బీఐ స్టాఫ్, అధికారుల కష్టం ఎంతో ఉంది. నా సహచరులు, డైరెక్టర్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. భవిష్యత్తులో వీరంతా ఆర్బీఐని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళతారని ఆకాంక్షిస్తున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్ అంటూ తన లేఖలో పేర్కొన్నారు.