కేసీఆరే మళ్ళీ సీఎం కావాలని కార్యకర్తలు శ్రీశైలానికి పాదయాత్ర…

SMTV Desk 2018-12-10 11:23:45  KCR,TRS.

హైదరాబాద్, డిసెంబర్ 10 : తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ కేసీఆరే సీఎం కావాలని చాలామంది కోరుకుంటున్నారు. తాజాగా గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి సీఎం కావాలని కోరుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 50మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు మహాశైవక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి పాదయాత్రగా తరలివెళ్లారు.

పాదయాత్రకు వెళుతున్నవారు మాట్లాడుతూ..‘ఈ నెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో టీఆర్‌ఎస్ పార్టీ వంద స్థానాలు సాధించడం ఖాయం. తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపారు. మరోసారి కేసీఆర్ సీఎం అవుతారు అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ వివేకానంద్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. ఇదిలావుండగా కేసీఆరే సీఎం అవాలని టీఎమ్మార్పీఎస్ నాయకులు మెదక్ చర్చిలో ప్రత్యేక

ప్రార్థనలు నిర్వహించారు. ఆంధ్రా నుంచి కూడా ఆయన అభిమానులు కేసీఆరే తెలంగాణకు నికార్సయిన ముఖ్యమంత్రి.. ఆయనే మళ్ళీ అధికారంలోకి వస్తే తెలంగాణ అభివృద్ధి మరింత పెరుగుతుందని పూజలు చేశారు. ఎన్నికలకు ముందు ఓ ఆంధ్రా అభిమాని కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని నాలుక కోసుకున్న విషయం తెలిసిందే.