పసల బేబి పాటకు చంద్రబాబు ఫిదా

SMTV Desk 2018-12-09 11:57:44  Pasala Beby, Chandra Babu, Andhra Pradesh

అమరావతి , డిసెంబర్ 09 :రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి నిన్న ఉండవల్లిలోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బేబీని పరిచయం చేశారు. ఎంతో శ్రావ్యంగా పాటలు పాడుతూ యూట్యూబ్‌లో లక్షాలాది శ్రోతలను అలరిస్తున్న పసల బేబిని చంద్రబాబు అభినందించారు. ఎలాంటి సంగీత శిక్షణా లేకుండా సినీ, అన్ని రకాల పాటలను వొక్కసారి వింటే చాలు.. నేపథ్య గాయకుల స్థాయిలో పాడగల నేర్పు పసల బేబిదని ముఖ్యమంత్రికి మురళీ మోహన్ వివరించారు.

వ్యవసాయ కూలీగా ప్రారంభమైన ఆమె ప్రస్థానం సినీ పాటలతో లక్షల మంది ఆన్‌లైన్‌ శ్రోతలను మెప్పించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. చక్కని స్వరంతో పాడిన పాటకు చంద్రబాబు ఫిదా అయ్యారు. ఆమె ప్రతిభను మెచ్చుకొని సన్మానించారు. ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశించారు. అనపర్తి నియోజకవర్గంలోని వడిసలేరు గ్రామీణ నేపథ్య గాయకురాలు పసల బేబి కొద్దికాలంగా పాటలను అనర్గళంగా, అమోఘంగా పాడుతూ శ్రోతలను మాత్రమే కాకుండా సంగీత దర్శకులు కీరవాణి, ఏఆర్‌ రెహమాన్‌ వంటి దిగ్గజాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.