సర్వేల స్వామి మరో సన్యాసానికి సిద్ధంగా ఉండాలి : కేటీఆర్

SMTV Desk 2018-12-08 18:19:11  KTR, Lagadapati Rajagopal, Telangana Elections

హైదరాబాద్, డిసెంబర్ 8: తెలంగాణ రాదని లగడపాటి రాజగోపాల్ చెబితే రావటం ఆగిపోయిందా? ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకున్నఆయన ఎన్నికల ఫలితాలు వచ్చాక సర్వేల సన్యాసం తీసుకోవడానికి సంసిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిన్న లగడపాటి తన సర్వే వివరాలు చెప్పారు, అసలు ఆయన ఏం చెప్పాడో ఆయనకన్నా అర్థమైందా అని ఎద్దవా చేసారు. తెలంగాణ దెబ్బకు లగడపాటి ఇది వరకే రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఇక, సర్వేల సన్యాసం కూడా ఆయన తీసుకోవడం ఖాయమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రతిపక్షాలు తమపై ఎన్ని కుట్రలు చేసినా,కూటములు కట్టినా ఎన్నిరకాల గారడీలు చేసినప్పటికీ ప్రజలు వాటిని పట్టించుకోకుండా, వారి చైతన్యాన్ని ప్రదర్శించారని అన్నారు. చివరి ఓటు లెక్క పెట్టే వరకూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కలలు కల్లలు కాబోతున్నాయని, ప్రజలు ఏకపక్షమైన తీర్పు ఇవ్వబోతున్నారని కేటీఆర్ అన్నారు.