జగన్‌ అసలు అసెంబ్లీకి వెళ్లరు : పవన్

SMTV Desk 2018-12-06 14:44:31  Jagan Mohan reddy, Pawan Kalyan, Janasena , YSRCP, Assembly

అనంతపురం, డిసెంబర్ 6: ప్రజావసరాలకు అనుగుణంగా రాజకీయ వ్యవస్థ నడవట్లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో నాయకులు ప్రజల బ్రతుకుకన్నా వారి ఓట్లకే ప్రాముఖ్యత ఇస్తున్నారు అని మండిపడ్డారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా పరిగణించినంత కాలం ఇక్కడ అభివృద్ధి ఎప్పటికీ జరగదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేసేది ఫిబ్రవరిలో ప్రకటిస్తానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో కరువు నివారణకు సమగ్ర ప్రణాళిక అవసరం ఉందని ఆయన తెలిపారు.

నేతలంతా వారి అవసరాలకు తప్ప ప్రజల కోసం పార్టీలను నడపటంలేదని ఆరోపించారు.జిల్లాలో ఉన్న యువతకు ప్రతిభ ఉంది, వీరి ప్రతిభ పక్క రాష్ట్రాల వారికి, ఇతర దేశాల వారికి ఉపయోగపడుతోంది. అలాంటి వీరిని ఈ ప్రాంత అభివృద్ధికే ఎందుకు వాడుకోలేకపోతున్నాం. యువతకు ప్రత్యేకత కేటాయించి తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించేలా ప్రణాళిక తీసుకురావాలి.

ప్రతిపక్ష నేత జగన్‌ అసలు అసెంబ్లీకి వెళ్లరు.. అనంతపురం కరవు గురించి ప్రశ్నించరని విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షానికి నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే అసెంబ్లీలో అనంతపురం కరవు గురించి మాట్లాడాలి. వలసల గురించి మాట్లాడాలి. వొకరిపై మరొకరు విమర్శలు చేసుకొని తిట్టుకుంటే ఏ ప్రయోజనం ఉండదు అని పవన్‌ అన్నారు.