జియో ఫోన్లతో టెలికాం వ్యవస్థకు ప్రయోజనమే..

SMTV Desk 2017-07-25 13:48:00  mumbai, reliance industrees, jio mobile.

ముంబై, జూలై 25 : చౌక ధరలోనే 4జీ ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురావడం వల్ల రిలయన్స్‌ జియోకు మాత్రమే కాకుండా పరిశ్రమకు ప్రయోజనం కలుగుతుందని తాజా నివేదిక స్పష్టం చేసింది. జియో మరో10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకునేందుకు 4జీ ఫీచర్‌ ఫోన్‌ దోహదపడుతుంది. 2018 నాటికి రాబడి పరంగా మార్కెట్‌ వాటా 3-4 శాతం నుంచి 10 శాతానికి పెరిగేందుకు దన్నుగా నిలవచ్చని ఫిచ్‌ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా పరిశ్రమ రాబడులు వృద్ధి చెందేందుకు సహాయపడవచ్చని తెలిపింది. జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ వల్ల ఇంటర్నెట్‌ను వినియోగించే వారి సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. అధిక డేటా రేట్లు, గ్రామాల్లో బ్రాడ్‌ బ్యాండ్‌ నెట్‌వర్క్‌ లేకపోవడం వల్ల ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భారత్‌ ఇంటర్నెట్‌ వ్యాప్తి తక్కువగా ఉంది. 2017 మార్చి త్రైమాసికం నాటికి టెలికాం పరిశ్రమ రాబడి అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 15.6శాతం తగ్గి 610 కోట్ల డాలర్లకు చేరుకుంది. టెలికాం కంపెనీల రాబడులు పెరిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఈ రంగానికి నెగిటివ్‌ ఔట్‌లుక్‌నే ఫిచ్‌ కొనసాగిస్తోంది. వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు మరిన్ని ఆఫర్లను జియో ప్రకటించే అవకాశం ఉండవచ్చని, దీంతో మిగిలిన కంపెనీలు డిస్కౌంట్, ధరల తగ్గుదల వంటి ఆఫర్లను ప్రకటించాల్సి రావచ్చని పేర్కొంది.