కెసిఆర్ పై బాబు ఫైర్

SMTV Desk 2018-12-05 13:35:33  KCR, chandra Babu naidu

హైదరాబాద్, డిసెంబర్ 05: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సికింద్రాబాద్‌లో పలు ప్రాంతాలలో రోడ్ షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “హైదరాబాద్‌ నగరంలో ఇదివరకు నేను చేసిన అభివృద్దే తప్ప ఈ నాలుగేళ్ళలో కేసీఆర్‌ కొత్తగా చేసిందేమీ కనబడటం లేదు. నాకు ఇక్కడ ఏం పని అని కేసీఆర్‌ పదేపదే అడుగుతున్నారు. నాకోసం వచ్చిన వచ్చిన ఇంతమంది ప్రజలను చూసినా కేసీఆర్‌కు అర్ధం కావడం లేదా? ఈ నాలుగేళ్ళలో కేసీఆర్‌ ఏనాడైనా నగరంలో వొక్క నియోజకవర్గంలోనైనా పర్యటించారా? పర్యటించి ఉండి ఉంటే నగరం పరిస్థితి, నగర ప్రజలు పడుతున్న ఇబ్బందులు అర్ధం అయ్యుండేవి. ఈ నాలుగేళ్ళలో నగరానికి, రాష్ట్రానికి ఆయన చేసిందేమీ లేదు.

5 ఏళ్ళు పాలించమని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూడా ఆయన ఉపయోగించుకోలేకపోయారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళారంటే సమాధానం చెప్పలేరు. కానీ రేపటి నుంచి డబ్బు సంచులతో దిగి ప్రజలను డబ్బుతో కొనుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని కలలుకంటున్నారు. తనను ప్రశ్నిస్తున్నవారిని పోలీసుల చేత బెదిరిస్తూ అరెస్టులు చేయిస్తున్నారు. కేసీఆర్‌ను బలంగా డ్డీ కొంటున్నందుకు కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని రాత్రి 3 గంటలకు అరెస్ట్ చేశారు. ఇటువంటి బెదిరింపులకు ఎవరూ భయపడబోరని కేసీఆర్‌ గ్రహిస్తే మంచిది. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోడీల నిరంకుశ, అప్రజాస్వామిక పాలనకు ముగింపు పలికేందుకే ప్రజాకూటమిని ఏర్పాటు చేశాము. కనుక ప్రజాకూటమి అభ్యర్ధులకు అందరూ ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ ప్రజలకు చేస్తున్నాను,” అని చంద్రబాబునాయుడు అన్నారు.