రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్న

SMTV Desk 2018-12-04 15:33:09  Utham Kumar, Revanth reddy,

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని, ఆయన సోదరులను మంగళవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేయడంపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్‌రెడ్డిని తక్షణమే విడిచిపెట్టాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషను వేసింది. దీనిపై కోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ, అప్రజాస్వామిక పాలన సాగుతోందని మేము చెపుతున్నదానికి ఇదే వొక తాజా ఉదాహరణ. కొస్గీలో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారసభ విఫలమవుతుందనే భయంతోనే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయించారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధులను, వారి అనుచరులను, కుటుంబ సభ్యులను ఈవిధంగా భయబ్రాంతులను చేస్తుంటే ఎన్నికల సంఘం ఏమి చేస్తోందో అర్ధం కావడం లేదు. రాష్ట్రంలో పోలీసులు, ఎన్నికల సంఘం పక్షపాతధోరణితో వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు.

కాంగ్రెస్‌ సీనియర్ నేత గద్వాల నుంచి పోటీ చేస్తున్న డికె.అరుణ మాట్లాడుతూ, “కొడంగల్‌లో కేసీఆర్‌ సభ పెట్టుకోవాలంటే రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేయాలా? ఎందుకు? అహంభావంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న కేసీఆర్‌కు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్పుతారు,” అని అన్నారు.

సీనియర్ నేత జనగామ నుంచి పోటీ చేస్తున్న పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడానికి పోలీసులు ఆయన ఇంటి తలుపులు పగులగొట్టుకొని లోపలకు ప్రవేశించవలసిన అవసరం ఏముంది? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నమా? పోలీసులు కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులతో ఈవిధంగా వ్యవహరించడం సరికాదు,” అని అన్నారు.

సీనియర్ కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎన్నికల సంఘం తెరాస ఏజంటులా వ్యవహరిస్తూ కళ్ళు మూసుకొని కూర్చోంది. కేసీఆర్‌ వలన లబ్దిపొందిన కొందరు అధికారులే ఇదంతా చేస్తున్నారు. కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకొంది. అందుకే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఇటువంటి పనులు చేస్తున్నారు. ఇందుకు ప్రజలు ఆయనకు గట్టిగా బుద్ది చెప్పబోతున్నారు,” అని అన్నారు.