విశాఖలో విగ్రహ రాజకీయం...!

SMTV Desk 2018-12-03 15:39:46  ANR, Dasari Narayanarao, Harikrishna

విశాఖపట్నం,డిసెంబర్ 3 : విశాఖపట్టణంలో ఎందరో మహనీయుల విగ్రహాలు కొలువు దీరి ఉన్నాయి. ఇటీవల వీటి సరసన మరో మూడు విగ్రహాలు చేరాయి. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు, దర్శకదిగ్గజం దాసరి నారాయణ రావు విగ్రహాలతోపాటు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన నందమూరి హరికృష్ణ విగ్రహాలను సాగర తీరాన ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాల ఏర్పాటు కోసం నగర పాలక సంస్థ అనుమతి తీసుకోకపోవడం వివాదాస్పదమైంది.

చిత్ర రంగానికి అశేష సేవలు అందించిన అక్కినేని నాగేశ్వరరావు, దాసరి విగ్రహాలను విశాఖలో ఏర్పాటు చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. వీరి విగ్రహాలతోపాటు హరికృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. విశాఖ నగరంతో పెద్దగా సంబంధం లేని ఆయన విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖ నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోకుండానే మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ విషయంలో జీవీఎంసీ యార్లగడ్డకు నోటీసులు పంపగా.. ప్రముఖ వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేయడంలో తప్పేంటి? గడచిన కాలంలో అధికారుల అనుమతి లేకుండా చాలా విగ్రహాలను ఆవిర్భావం చేశారని ఆయన సమాధానం ఇచ్చారు. యార్లగడ్డను రాజ్యసభకు నామినేట్ చేయడంలో హరికృష్ణ కీలకపాత్ర వ్యవహరించారు, ఆ కృతజ్ఞతతోనే.. ఆయన హరికృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారనే టాక్ నడుస్తోంది.